హామిల్టన్ టెస్టు: ఆస్ట్రేలియా వెన్ను విరిచిన వెట్టోరి

శనివారం, 27 మార్చి 2010 (11:18 IST)
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి అద్భుతంగా రాణించాడు. ఫలితంగా హామిల్టన్‌లో శనివారం నుంచి ప్రారంభమైన తొలిటెస్టులో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు 231 పరుగులకే ఆలౌట్ అయింది. డేనియల్ వెట్టోరితో పాటు ఫాస్ట్ బౌలర్ సౌథీ రాణించి నాలుగు చొప్పన వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కటిచ్, వాట్సన్‌లు శుభారంభాన్ని ఇవ్వలేక పోయారు. సౌథీ బౌలింగ్‌లో కేవలం 12 పరుగులు చేసి ఆర్నెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కటిచ్‌తో జత కలిసిన పాటింగ్ (22) లేని రనౌట్ అయ్యాడు.

పిమ్మట క్రీజ్‌లోకి వచ్చిన హుస్సే (22), క్లార్క్ (28), నార్త్ (9), హ్యాడ్డిన్ (12), జాన్సన్ (0), హౌరిట్జ్ (10), బోలింగర్ (4)లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ కటిచ్ మాత్రం అద్భుతంగా ఆడి 88 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 74.3 ఓవర్లలో 231 పరుగుల వద్ద ముగిసింది.

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. మిషితోష్ నాలుగు పరుగుల వద్ద బోలింగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు, క్రీజ్‌లో వాట్లింగ్ (6), స్లించర్ (8)లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి