ఐపీఎల్ సెమీస్‌కు చేరడమే సచిన్ సేన లక్ష్యం..!?

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ సెమీఫైనల్‌కు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొహలీలో శుక్రవారం రాత్రి జరిగిన 41వ లీగ్ మ్యాచ్‌లో అనూహ్య ఓటమిని చవిచూసిన ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై నెగ్గాలని తహతహలాడుతోంది.

జైపూర్‌లో ఆదివారం రాత్రి జరిగే 45వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. షేన్ వార్న్ సేన మరియు శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ జట్టు ఆడిన పది ఐపీఎల్ మ్యాచుల్లో ఏడింటిలో విజయాలను, మిగిలిన మూడింటిలో పరాజయాలను చవిచూసింది.

దీంతో 14 పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు, సెమీస్ బెర్త్‌ను కూడా ఖరారు చేసేందుకు ముంబై ఇండియన్స్ సాయశక్తులా ప్రయత్నిస్తోంది.

కాగా.. వరుస అపజయాలతో సతమవుతూ.. ఐపీఎల్ పట్టికలో చివరిస్థానంలో నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓడిపోయింది. అయితే ఇంతకుముందు జరిగిన ఐపీఎల్ 27వ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.

కానీ శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్ కెప్టెన్ సంగక్కర కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగి ఆడటంతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.

దీంతో ఐపీఎల్-3 సెమీఫైనల్‌కు ఒక్క విజయం దూరంలో ముంబై ఇండియన్స్ వెనక్కి తగ్గింది. కానీ రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి, సెమీఫైనల్లోకి అడుగు పెట్టాలని సచిన్ సేన భావిస్తోంది.

ఇకపోతే.. ఐపీఎల్ పట్టికలో 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోన్న రాజస్థాన్ రాయల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించాలంటే ఇంకా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన అవసరం ఉంది.

వెబ్దునియా పై చదవండి