భారీ లక్ష్య చేధనలో భారత్ లోపాలు ఎత్తిచూపిన వన్డే సిరీస్
శుక్రవారం, 23 నవంబరు 2007 (14:43 IST)
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు పైచేయి సాధించినప్పటికీ.. మరికొన్ని విషయాల్లో మాత్రం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ముగిసిన ఈ సిరీస్‌లో మొత్తం ఐదు వన్డే మ్యాచ్‌లలో మూడింటిని భారత్ గెలుచుకోగా.. రెండింటిలో పాకిస్తాన్ జట్టు గెలుపొందింది. అయితే తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలువగా.. రెండో వన్డేలో పాకిస్తాన్ 300 పైచిలుకు భారీ లక్ష్యాన్ని చేధించింది.
అదే.. సిరీస్‌లోని ఆఖరి వన్డేలో పాకిస్తాన్ నిర్థేసించిన 306 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు భారత్ బ్యాట్స్‌మెన్స్ తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో నిలకడ లేమి కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ నిర్లక్ష్యం ఆడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. దీంతో భారీ లక్ష్యాలను టీమ్ ఇండియా చేధించలేదనే అపవాదును మూటగట్టుకుంటోంది.
దీని నుంచి బయటపడాలంటే.. భారత టాప్ ఆర్డర్లో నిలకడ అనేది స్పష్టంగా కనిపించాలి. అపుడే.. ప్రత్యర్థి ఎలాంటి లక్ష్యాన్నైనా నిర్థేశించినప్పటికీ.. అలవోకగా చేధించవచ్చు. కాగా రెండో వన్డే భారీ విజయలక్ష్యాన్ని పాక్ చేధించడంతో ఒక్కసారి ఖంగుతున్న భారత్ జట్టు ఆ తర్వాత జరిగిన మూడు, నాలుగు వన్డేల్లో అప్రమత్తంగా ఆడి సిరీస్‌ను మరోమ్యాచ్ మిగిలి వుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఇకపోతే.. భారత్ బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో కూడా మరింతగా మెరుగుపరుచుకోవాల్సి వుంది. రెండో వన్డేలో పాక్ బ్యాట్స్‌మెన్స్ ఫీల్డర్ల మధ్యలో బంతిని నెట్టి సింగిల్స్ దొంగిలించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. యూనిస్ ఖాన్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఇందుకు కారణం భారత ఫీల్డింగ్‌లోని లొసుగులను వినియోగించుకోవడం వల్లే మ్యాచ్‌ను ఒటి చేత్తో గెలిపించాడన్నది నిజం.