బుద్ధిహీనుడైన కెప్టెన్ మతిలేని పని చేశాడు : షోయబ్ అక్తర్

సోమవారం, 17 జూన్ 2019 (15:48 IST)
వరల్డ్ కప్ టోర్నీలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్ ఫలితంపై ఇప్పటికే లెజెండ్ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందించగా, ఇపుడు మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఆగ్రహంతో రగిలిపోతూ స్పందించాడు. 
 
"ఇంత బుద్ధివిహీనుడైన కెప్టెన్‌ను ఎక్కడా చూడలేదు. ఇంత తెలివితక్కువ పనిచేస్తాడని ఏమాత్రం ఊహించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటాడనుకుంటే మతిలేని పని చేశాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలవగానే సగం మ్యాచ్ చేతిలోకి వచ్చేసిందనుకున్నాం కానీ సర్ఫరాజ్ చేజేతులా మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశాడు. పాక్ ఛేజింగ్ చేయలేదన్న విషయం తెలిసి కూడా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడో అతనికే తెలియాలి. ఇమ్రాన్ ఖాన్ తరహాలో తెలివైన ఎత్తుగడలు వేస్తాడనుకుంటే బుద్ధిమాలిన పనులతో చెడ్డపేరు తీసుకువస్తున్నాడు" అంటూ అక్తర్ మండిపడ్డారు.
 
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో కూడా పాక్ ఇదేతీరులో వెస్టిండీస్ చేతిలో ఓడిపోగానే, అక్తర్ తన విమర్శనాస్త్రాలు సర్ఫరాజ్‌పైనే ఎక్కుపెట్టాడు. సర్ఫరాజ్‌కు బాగా కొవ్వెక్కువైంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇపుడు బుద్ధివిహీనుడైన కెప్టెన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తంమీద మాంచెష్టర్ వేదికగా భారత్‌ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడాన్ని పాకిస్థానీయులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు