హమ్మయ్యా... మాంచెష్టర్‌లో సూర్యుడు కనిపించాడోచ్....

ఆదివారం, 16 జూన్ 2019 (13:13 IST)
ప్రపంచ క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం మాంచెష్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. అయితే, గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో మైదానం చిత్తడిగా మారింది. దీంతో ఆదివారం మ్యాచ్ జరుగుతుందో లేదోనన్న సందేహం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కి వేదికకానున్న మాంచెస్టర్‌లో ఆకాశం నిర్మలంగా ఉందని, సూర్యుడు కనిపించాడని చెబుతూ, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని ఫొటోలు తన అభిమానులతో పంచుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన సెహ్వాగ్, మాంచెస్టర్ వెదర్ ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నాడు. 
 
ఈ ఫొటోల్లో ఆకాశంలో అక్కడక్కడా మేఘాలు తప్ప, వర్షం కురిపించే దట్టమైన మేఘాలు కనిపించకపోవడం గమనార్హం. అయితే, మ్యాచ్ మొదలయ్యే సమయానికి వరుణుడు వచ్చేస్తాడని బ్రిటన్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మ్యాచ్ మధ్యలో ఒకటి, రెండుసార్లు వర్షం కురుస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, మాంచెష్టర్‌లో వర్షం ఆగిపోయింది. దీంతో భారత క్రికెట్ జట్టు మైదానం వద్దకు చేరుకుంది.ఈ వరల్డ్ కప్ పోటీల్లోనే అత్యంత ఆసక్తిగా సాగుతుందని భావిస్తున్న ఈ దాయాదుల పోరును వరుణుడు అడ్డుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినా, గత రెండు గంటలుగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో వర్షం కురవకపోవడంతో అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. 
 
దీంతో గ్రౌండ్‌స్టాఫ్ తీవ్రంగా శ్రమిస్తూ, మైదానం నుంచి నీటిని తోడే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఉదయం వరకూ 10 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత, ఇప్పుడు 15 డిగ్రీలకు చేరుకుంది. మ్యాచ్ సమయానికే ప్రారంభమైనా, మధ్యలో ఒకటి, రెండు సార్లు వర్షం పడవచ్చని, ఉరుములు, మెరుపులు కూడా రావచ్చని తెలుస్తోంది. 
 
మరో రెండు గంటల పాటు వర్షం కురవకుంటే, సమయానికి మైదానాన్ని సిద్ధం చేస్తామని గ్రౌండ్‌స్టాఫ్ అంటోంది. మరోవైపు ఇరు జట్లూ హోటల్‌కు చేరుకున్నాయి. అప్పటికే మైదానం వద్దకు భారీ ఎత్తున చేరుకున్న భారత క్రికెట్ అభిమానులు కోహ్లీ సేనకు స్వాగతం పలికారు. భారత్ విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకుందంటూ 'జీతేగా భయ్ జీతేగా... ఇండియా జీతేగా' అంటూ నినాదాలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు