ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కివీస్‌పై గెలిచిన పాకిస్థాన్ జట్టు సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - పాకిస్థాన్ జట్లు తలపడగా, పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజం అద్భుతమైన సెంచరీ చేయగా, షహీన్ 28 పరుగులిచ్చి కివీస్ బ్యాట్స్‌మెన్ల వెన్ను విరిచాడు. ఫలితంగా కివీస్ ఉంచి 238 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
నిజానికి భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆ జట్టుపై నలువైపుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల ఫలితమో ఏమోగానీ, పాకిస్థాన్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ రంగాల్లో అద్భుతంగా రాణించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఆ జట్టులో జేమ్స్ నీషమ్ (97 నాటౌట్), గ్రాండ్‌హోమ్ (64) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 పరుగులు చేశాడు. కోలిన్ మన్రో 12 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ దాటలేదు. దీంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేసింది. పాక్ బౌలర్ షహీన్ పది ఓవర్లు వేసి కేవం 28 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి కివీస్‌ను కోలుకోలేనివిధంగా దెబ్బతీశాడు.
ఆ తర్వాత 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. బాబర్ ఆజం (101) అజేయ సెంచరీకితోడు హరీస్ సోహైల్ (68) మరోమారు సత్తా చాటడంతో 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెంచరీ వీరుడు బాబర్ ఆజంకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.