హర్యానా రాష్ట్రంలో గురు పౌర్ణమి పండుగ రోజున దారుణం జరిగింది. గురువులను పూజించుకోవాల్సిన రోజునే ఓ గురువు హత్యకు గురయ్యాడు. అదీకూడా విద్యార్థి చేతుల్లోనే ఈ హత్యకు గురికావడం గమనార్హం. హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పినందుకు ప్రిన్సిపాల్‌ను ఇద్దరు విద్యార్థులు కలిసి హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని హిసార్‌లోని కర్తార్ మెమోరియల్ పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. జుత్తు కత్తిరించుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని ప్రిన్సిపాల్ చెప్పగా, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆయనను కత్తితో పలుమార్లు పొడిచి హత్యచేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావడం గమనార్హం.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని తీసుకున్న పోలీసులు.. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సైతం రికార్డు చేశారు. పోస్టుమార్టం నివేదిక, సమగ్ర దర్యాప్తు తర్వాతే హత్యకు దారితీసిన పరిస్థితులు తెలుస్తాయని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.