గుంటూరులో ఘోరం జరిగింది. వీధి కుక్క ఒకటి ఓ బాలుడు గొంతుకొరికి చంపేసింది. మృతుడుని నాలుగేళ్ల ఐజాక్‌గా గుర్తించారు. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గుంటూరు నగర శివారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణభారతి నగర్ సమీపంలో గల ఐద్వా నగర్‌కు చెందిన కొమ్మగాని నాగరాజు - రాణి అనే దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నాగరాజు ఆటో డ్రైవరుగా, రాణి కూలిపని చేస్తుంటూ బిడ్డలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పిల్లలతో కలిసి ప్రార్థన కోసం సమీపంలోని ఓ మందిరానికి వెళ్లి సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి వచ్చారు.
తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో ఇంటోకెళ్లగా చిన్న కుమారుడైన ఐజాక్ (4) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కొద్ది సమయానికి అటుగా వచ్చిన వీధి కుక్క ఒక్కసారిగా ఐజాక్‌పైకి దూకింది. మెడకొరికి తీసుకెళుతుండగా బాలుడు పెద్దగా ఏడవడంతో స్థానికులు గమనించి, ఆ కుక్కపైకి రాళ్లు విసిరాడు. దీంతో కుక్క బాలుడుని అక్కడ వదిలి పరిగెత్తింది.
అప్పటికి తీవ్ర గాయాలైన ఐజాక్ తల్లిండ్రులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఐజాక్ మృతిచెందినట్టు చెప్పారు. దీంతో అప్పటివరకు తమతో ఉన్న బిడ్డ, మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుయ్యారు. గుంటూరు నగరంలో వీధి కుక్కలు ఏ స్థాయిలో స్వైర విహారం చేస్తున్నాయో ఈ ఘటన మరోసారి రుజువుచేసింది.