ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ జంట తమ 25వ వార్షిక వివాహ వేడుకులను ఘనంగా జరుపుకుంది. ఇందులో భార్యతో కలిసి భర్త డ్యాన్స్ చేస్తూ, ఉన్నట్టుండి భర్త కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హఠాత్ పరిణామంతో అతిథులు సహా అందరూ నిశ్చేష్టులైపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మృతుడుని 50 యేళ్ల షూ వ్యాపారి వాసిమ్ సర్వాత్‌గా గుర్తించారు. తన భార్య ఫరాతో కలిసి సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించగా, ఈ వేడుక విషాదంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తూ గడిపిన వాసిమ్... ఆ తర్వాత ఉన్నట్టుండి స్టేజీపై కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
కాగా, వాసిమ్ భార్య ఫరా ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇది గుర్తించలేని గుండెపోటు అని సీనియర్ కార్డియాలజిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు. రక్త ప్రసరణలో సమస్యలు గానీ, గుండె లయలో సమస్యలు గానీ అంతర్లీనంగా ఉన్నపుడు ఇలాంటి హఠాత్ పరిణామాలు జరుగుతుంటాయని తెలిపారు. అందువల్ల ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలుగానీ, గుండె లయ అసంబద్ధంగా ఉన్నపుడు కానీ వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.