ఇంటి యజమాని వికృతరూపం... యువతుల గదిలో రహస్య కెమెరాలు..

బుధవారం, 12 జులై 2023 (10:26 IST)
హైదరాబాద్ నగరంలోని యూసుఫ్ గూడలో ఓ ఇంటి యజమాని తనలోని వికృత రూపాన్ని ప్రదర్శించారు. యువతులకు అద్దెకు ఇచ్చిన గదుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. వీటిని తన గదిలోని కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌తో దానిని అనుసంధానం చేశాడు. యువతులు గదిలో ఉన్న సమయంలో వీటి ద్వారా చూసేవాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరి హైలం కాలనీలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువతి (20) తన సోదరుడు, స్నేహితురాలితో కలిసి రెండు నెలల క్రితం ఒక గదిలో అద్దెకు దిగారు. ఆ యువతులపై కన్నేసిన ఇంటి యజమాని సయ్యద్‌ సలీమ్‌ (40) కొద్దిరోజుల క్రితం వారి గదికి ప్రత్యేకంగా విద్యుత్తు మీటర్‌ బాక్సు పేరిట ఓ డబ్బాను ఏర్పాటుచేసి అందులో రహస్య కెమెరాను అమర్చాడు.
 
దీనికి సంబంధించిన తీగను తన గదిలోని కంప్యూటర్‌కు కలిపాడు. దీంతోపాటు తన ఇంటి పరిధిలో ఏర్పాటు చేసుకున్న మరో నాలుగు కెమెరాలకు సంబంధించిన దృశ్యాలను ప్రత్యక్షంగా చూసుకోవడానికి సెల్‌ఫోన్‌లో యాప్‌ వేసుకున్నాడు. ఇందుకోసం రెండు ప్రత్యేక డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌)లు ఏర్పాటు చేసుకొని ఒక దానిని యువతుల గదికి అనుసంధానం చేశాడు. 
 
యువతులు ఇంటికి రాగానే సలీమ్‌ రహస్య కెమెరా ద్వారా గదిలో ఉన్న వారిని గమనిస్తుండేవాడు. సోమవారం రాత్రి అనుమానంతో డబ్బా తెరిచిన యువతులు అందులో కెమెరా చూసి అవాక్కయ్యారు. దాని వైరు యజమాని ఇంట్లోకి వెళ్లడాన్ని గుర్తించారు. వారు వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సయ్యద్‌ సలీమ్‌ను అదుపులోకి తీసుకొని సెల్‌ఫోన్‌, కెమెరా, డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు