ప్రియుడుతో మాట్లాడుతోందని అక్కతో గొడవకు దిగిన తమ్ముడు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పెంజర్లకు చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు.
పెద్ద కుమార్తె రుచిత (21) డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. ఈ విషయంపై కుటుంబంలో గొడవలు కూడా జరుగగా, ఆ తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ వరకు వెళ్లింది. ఇకపై మాట్లాడుకోమని వారు పంచాయతీ పెద్దలకు హమీ ఇచ్చారు. దీంతో సమస్య సద్దుమణిగిందని భావించారు.
అయితే, కొంతకాలం తర్వాత నుంచి మళ్లీ ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. దీనిపై సోదరుడు రోహిత్ (20) రుచితను మందలించసాగాడు. సోమవారం తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంట్లో రుచిత, రోహిత్ మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో ప్రేమికుడితో అక్క ఫోనులో మాట్లాడటాన్ని గమనించిన రోహిత్ ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్... అక్క మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేయడంతో రుచిత చనిపోయింది.