రెండు ఎకరాల భూ వివాదం ఆరుగురు కుటుంబ సభ్యుల హత్యకు దారితీసింది. ఓ మాజీ సైనికుడు ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను గొడ్డలితో నరికివేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మాజీ సైనికుడు రెండెకరాల భూవివాదంలో తన కుటుంబంలోని ఆరుగురి సభ్యులను కిరాతకంగా హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి సరూపి దేవి (65), అన్న హరీశ్ కుమార్ (35), వదిన సోనియా (32), ముగ్గురు చిన్నారులు.. పరి (7), యషిక (5) మయాంక్ (6నెలలు) ఉన్నారు. వారంతా నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో ఈ దారుణానికి భూషణ్ కుమార్ పాల్పడ్డాడు.
అన్న, వదినను నరికిన తర్వాత వారి ముగ్గురు పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. అనంతరం మృతదేహాలను తగలబెట్టే ప్రయత్నం చేశాడు. తండ్రి ఓం ప్రకాశ్ అడ్డుకోవడంతో ఆయనపైనా దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి అంబాలా జిల్లా రతోర్ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.