ఆమె 3 పెళ్లిళ్లు చేసుకున్నది. తన మాజీ సహచరుడిని హత్య చేసిన కేసులో నాలుగున్నర సంవత్సరాలు జైలులో గడిపి, తరువాత నిర్దోషిగా విడుదలైన 32 ఏళ్ల మహిళను శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆమె ప్రస్తుత సహచరుడు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపాడు.
గ్వాలియర్ నగరంలోని రూప్ సింగ్ స్టేడియం వెలుపల బాధితురాలిని నందిని కేవత్‌గా గుర్తించారు. ఆమె సహచరుడు 33 ఏళ్ల అరవింద్ పరిహార్ ఆమెపై పలుసార్లు కాల్పులు జరిపాడు. దీనితో ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. ఈ ఘటనను స్థానికులు వీడియోలో బంధించారు. తనతో సహజీవనం చేస్తూ అర్థంతరంగా వదిలేసిన నందిని కోసం నిందితుడు రూప్ సింగ్ రోడ్డు పక్కన కాపు కాసాడు. ఆమె అటుగా రాగానే తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత రోడ్డు పక్కనే కూర్చుని పిస్టల్‌ను చూపిస్తూ, స్థానికులకు గురిపెట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సీఎస్పీ నాగేంద్ర సింగ్ సికార్వర్ నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, టియర్ గ్యాస్ షెల్ ప్రయోగించిన తర్వాత, సాయుధ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో పోలీసు బృందం నందినిని ట్రామా సెంటర్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
ప్రాథమిక దర్యాప్తులో అరవింద్, నందిని 2022 నుండి సహజీవనంలో ఉన్నారని తేలింది. 2023లో ఒక ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నట్లు అతను పేర్కొన్నాడు, కానీ నందిని అతనిపై అనేక కేసులు నమోదు చేసిన తర్వాత ఆ సంబంధం చెడిపోయింది. 2024లో అలాంటి ఒక కేసులో, ఆమెను కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసి 3 నెలల పాటు జైలులో వుంచారు. ఈ తర్వాత ఆమె తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంది.
అరవింద్‌తో సంబంధానికి ముందు, నందిని ఇతర పురుషులతో కలిసి సహజీవనం చేసింది. వారిలో 2017లో దాటియా జిల్లాలో హత్యకు గురైన నిమ్లేష్ సేన్ కూడా ఉన్నారు. ఈ నేరానికి నందిని మరో భాగస్వామి ఫిరోజ్ ఖాన్‌తో కలిసి జైలు శిక్ష అనుభవించింది. కానీ నాలుగు సంవత్సరాలుగా జైలులో ఉన్న తర్వాత 2022లో కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. మృతురాలు నందిని 4 పెళ్లిళ్లు చేసుకుంటే నిందితుడు అరవింద్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు.