కేవలం 34 రోజుల్లో 12 మంది భర్తలు చనిపోయారు. కాదు చంపబడ్డారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో భర్తల హత్యలకు లేదా బలవన్మరణాలకు భార్యల వివాహేతర సంబంధాలు కారణమయ్యాయి. నివేదికల ఆధారంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 12 మంది భర్తలు వారివారి భార్యల వివాహేతర సంబంధాల వల్ల హత్య చేయబడ్డారు. తమ ప్రియుళ్లతో కలిసి భార్యలు ఈ ఘాతుకాలకు పాల్పడ్డట్లు పోలీసుల రిపోర్టుల్లో వెల్లడయ్యింది.
మీరట్ నగరంలో సంచలనం సృష్టించిన నేవీ అధికారిని అతడి భార్య తన ప్రియుడితో కలిసి మట్టుబెట్టింది. మరో ప్రాంతంలో పెళ్లి చేసుకున్న 15 రోజులకే నూతన వధువు తన ప్రియుడితో కలిసి ఓ కాంట్రాక్ట్ కిల్లర్ ను మాట్లాడి భర్తను హత్య చేయించింది. పెళ్లి చేసుకుని భర్తను నిత్యం వేధింపులకు గురిచేస్తూ వుండటమే కాకుండా తన ప్రియుడితో గడుపుతున్న భార్యను మార్చుకోలేక ఓ భర్త బలన్మరణానికి పాల్పడ్డాడు.
ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణం... పెళ్లికి ముందు ఓ వ్యక్తిని ప్రేమించిన అమ్మాయిలు ధైర్యంగా తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించలేకపోవడం ఒకటైతే.. పెళ్లయ్యాక భర్త తనను బానిసలా చూడటమో లేదంటే అతడి నుంచి ప్రేమాప్యాయతలు కరవవడమో జరుగుతున్నది. ఇవేకాదు... పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన నూతన వధువుకి షాకిచ్చే వాస్తవాలు తెలుస్తున్నాయి.
ఐతే... ప్రాధమిక విద్య నుంచి రిలేషన్ షిప్ గురించి పిల్లలకు పాఠాల రూపంలో బోధిస్తే ఫలితం వుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే... వేగంగా మారుతున్న జీవనశైలికి తగ్గట్లు సంబంధాలకు ఇవ్వాల్సిన విలువ లేకుండా పోతుందనీ, ఫలితంగా వివాహేతర సంబంధాలు, ఇతర అనైతిక బంధాలలో ఇరుక్కుపోయిన యువతీయువకులు తమ సంతోషం కోసం భాగస్వామిని అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనకాడబోరని జరుగుతున్న ఘటనలే చెబుతున్నాయి.