భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

ఠాగూర్

మంగళవారం, 6 మే 2025 (14:18 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం అనివార్యంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 244 జిల్లాల్లో యుద్ధ సన్నాహాల్లో భాగంగా, సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ముఖ్యంగా రక్షణ, అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇదే అంశంపై మంగళవారం కూడా కేంద్ర హోం శాఖ కార్యదర్శి కీలక సమావేశం కూడా నిర్వహించారు. 
 
అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించి, వారిని సమాయత్తపరిచేందుకు దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రేపు ఈ కసరత్తు జరుగనుంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. 
 
దేశ వ్యాప్తంగా మొత్తం 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముఖ్యంగా (డిఫెన్స్, అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలు)ప్రాతిపదికగా చేసుకుని ఈ జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. అణు విద్యుత్ కేంద్రాలున్న ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్ భటా, చెన్నై, కల్పాక్కం, నరోరా వంటి ప్రాంతాలను కేటగిరీ-1లో చేర్చారు. 
 
కేటగిరీ-2లో హైదరాబాద్, విశాఖపట్టణం సహా 201 జిల్లాలు ఉన్నాయి. మూడో కేటగిరీలో 45 జిల్లాలు ఉన్నాయి. ముఖ్యంగా, హైదరాబాద్, విశాఖపట్టణం నగరాల్లోని విమానాశ్రయాలు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్విహంచనున్నారు. ఈ కసరత్తులోభాగంగా ప్రజలకు శిక్షణ, అవగాహన కల్పించడంపై హోం శాఖ సమీక్షలో ప్రధానంగా చర్చించారు. వైమానిక దాడి హెచ్చరిక సైరన్ మోగినపుడు ఎలా స్పందించాలి, విద్యుత్  సరఫరా నిలిచిపోయినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువుల, మందుల గురించి ప్రజలకు వివరించాలని సమావేశంలో సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు