"యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్"... ఏ పని చేయకున్నా ఖాతాల్లోకి డబ్బులే... ప్రధాని మోడీ తాజా స్కీమ్!

శనివారం, 14 జనవరి 2017 (15:42 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడిచిన రెండున్నరేళ్లుగా వేసిన ప్రతి అడుగు కూడా ప్రత్యేకమనే చెప్పాలి. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీ చేసిన ప్రచారం అంతకుముందెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. అందుబాటులోకి వచ్చిన సోషల్‌ మీడియాతో దుమ్ము రేపిన మోడీ వైరి వర్గాలను పెద్ద దిబ్బే కొట్టారు. దాదాపు మూడు దశాబ్దాలుగా దేశంలో కనిపించకుండా పోయిన సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీని అందలమెక్కించారు. 
 
ఆ తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోడీ ప్రకటించిన ప్రతి పథకం కూడా జనాన్ని విశేషంగా ఆకట్టుకుందనే చెప్పాలి. స్వచ్ఛభారత్‌ ఆదర్శ గ్రామ యోజన స్మార్ట్ సిటీ తదితర కొత్త పథకాలన్నీ కూడా మోడీ ఇమేజ్‌ని పెంచాయనే చెప్పాలి. ఇక రెండు నెలల క్రితం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఆ తర్వాత రూ.2 వేల నోటు పేరిట మరింత పెద్దగా నోటు ఎంట్రీ మోడీని తొలుత ఆకాశానికెత్తేసిన జనం ఆ తర్వాత విమర్శలు చేయడం మొదలుపెట్టారు. 
 
పెద్ద నోట్ల రద్దు తర్వాత త్వరలో ప్రవేశపెడుతున్న కేంద్ర బడ్జెట్‌లో మోడీ మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో వెలుగులోకి వచ్చిన నల్లధనాన్ని జన్‌‌ధన్‌ ఖాతాల్లో జమచేస్తారని తొలుత భావించినా దానిపై ప్రభుత్వం ఇప్పటిదాకా నోరు విప్పలేదు. ఈ క్రమంలో వచ్చే బడ్జెట్‌లో దీనిపై ఒక సంచలన ప్రకటన రావచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. 
 
ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ తెరపైకి వచ్చింది. ఈనెల 3న బిజినెస్ ఇన్‌‌సైడర్ అనే ఒక వెబ్‌సైట్ రాసిన కథనం ఈ అంశాన్ని తెరపైకి వచ్చిందని చెప్పాలి. ఈ కథనం ప్రకారం దేశంలో యూబీఐ పథకాన్ని ప్రవేశపెట్టే దిశగా మోడీ సర్కారు ఆలోచిస్తోంది. ఈ నెలాఖరులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒక కీలక ప్రకటన చేయనున్నారని ఈ దిశగా జరుగుతున్న కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందన్న వార్తలు ఆశక్తి రేపుతున్నాయి. 
 
అసలు యుబిఐ అంటే ఏమిటంటే దేశంలో ధనిక పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఖాతాలో ఒక నిర్ణీత నగదును జమ చేస్తారు. ఈ నగదును పౌరులు తమ నిత్యావసరాలకే కాకుండా ఇతరత్రా దేనికైనా వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగం ద్వారానే లేదా స్వయం ఉపాధి ద్వారానే మనం సంపాదిస్తున్న ఆదాయంపై ప్రభుత్వం పన్ను వేస్తోంది. యుబిఐ ద్వారా మన ఖాతాల్లో జమ అయ్యే మొత్తంపై ఇలాంటి పన్నేమీ ఉండదట. అంటే యుబిఐ అమల్లోకి వస్తే ఇక ఏ పని చేయకున్నా దేశ పౌరులందరికీ ఎంతో కొంత మొత్తం చేతికందుతుందన్నమాట. 
 
వేతన జీవులకు దీనిపై ఆశక్తి ఉండకున్నా పేద దిగువ మధ్య తరగతి ఏ ఆసరా లేని వారు మాత్రం ఈ పథకానికి బాగానే ఆకర్షితులయ్యే అవకాశాలు లేకపోలేదు. ఊరికే డబ్బు వచ్చి పడుతుందంటే ఎవరికి మాత్రం మాత్రం ఆశ ఉండదు చెప్పండి. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాకున్నా కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన కొందరు అధికారులు మాత్రం పేర్లు వెల్లడించుకుండానే ప్రభుత్వం ఈ దిశగా ముమ్మర కసరత్తు చేస్తోందని చెబుతుండడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి