'అన్న' ఎన్టీఆర్‌లా నేను కూడా... రజినీకాంత్ సంచలనం....

బుధవారం, 17 జనవరి 2018 (22:43 IST)
తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 8 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన తెదేపాను 29 మార్చి 1982న స్థాపించి 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అలాంటి చరిత్రనే సృష్టిస్తానంటున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడులో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి సిద్ధమేనంటున్నారు. కమల‌్ హాసన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. కొందరు వేసిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ... తన ఎన్నికల వ్యూహం ఎలా వుంటుందో చెప్పబోననీ అన్నారు. రాజకీయాల్లో కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు.
 
ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదని ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులకు ముందే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన రజనీకాంత్‌కు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తన పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి. ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఇప్పటికే రజనీకాంత్ ఉన్నారు. అయితే తాను చేస్తున్న రెండు సినిమాలు చివరి దశకు చేరుకోవడంతో ప్రస్తుతానికి వాటిని పూర్తి చేసి తీరాలనుకుంటున్నారు. 
 
అయితే గత వారంరోజులుగా రజనీకాంత్ తమిళనాడు ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా సీఎం అయ్యే అవకాశమే లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం 33 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే రజనీ గెలుచుకోగలడని, అన్నాడిఎంకే, డిఎంకే పార్టీలకు గతంలోలానే సీట్లు వచ్చే అవకాశం ఉందని, అయితే డీఎంకేకే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఒక సర్వేలో తెలిపింది.
 
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా డీఎంకేకి 133 సీట్లు రావడం ఖాయమని, అన్నాడిఎంకే మాత్రం ఘోరంగా ఓడిపోవడం ఖాయమని, దాంతో పాటు రజనీకాంత్‌కు 25 నుంచి 30 సీట్లు మాత్రమే రావచ్చని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేతో రజనీ అభిమానులు ఢీలా పడిపోతున్నారు. అయితే సర్వేలను పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదంటూ కొంతమంది రజనీకాంత్ అభిమాన సంఘం నేతలు చెబుతుంటే మరికొందరు మాత్రం సర్వేలను కొట్టి పారేయకూడదంటున్నారు. రజనీకాంత్ నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులకు సీట్లిస్తే ఖచ్చితంగా తమిళ ప్రజలు ఆదరిస్తారని, అప్పుడు ఖచ్చితంగా రజనీకాంత్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి రజనీ ఎలాంటి వారికి టిక్కెట్లిస్తారనేది వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు