కేసీఆర్‌ను బట్టలిప్పిచ్చి కొడతానన్న పవన్: ఇంతలోనే నచ్చేశాడా?

బుధవారం, 3 జనవరి 2018 (16:18 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీని కాంగ్రెస్ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిన్నటి నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, రేవంత్ రెడ్డి పవన్‌పై విమర్శలు గుప్పించారు. 
 
తాజాగా టీకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్‌పై మండిపడ్డారు. ఏదో పెద్ద పని కానించుకునేందుకే పవన్ కేసీఆర్‌తో భేటీ అయ్యారని కామెంట్స్ చేశారు. తెలంగాణ పట్ల పవన్ ఓ పురుగులా మారాడని.. తెలంగాణ రాజకీయాల్లో కల్పించుకోవద్దని తాను వార్నింగ్ ఇస్తున్నానని తెలిపారు. 
 
పవన్ కల్యాణ్‌ కేవలం సినీనటుడు మాత్రమేనని.. రాజకీయాల పట్ల ఆయనకు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఇచ్చిన ప్రసంగాలు చూస్తేనే.. పవన్ అవగాహనారాహిత్యాన్ని అర్థం చేసుకోవచ్చునన్నారు. పవన్ దగ్గర సబ్జెక్ట్ లేదని తెలిపారు. పవన్ ప్రసంగాన్ని గమనిస్తే.. అసందర్భానుసార వ్యాఖ్యలుంటాయని, ఆవేశపడిన క్షణాల్లోనే నవ్వేస్తారని ఎద్దేవా చేశారు. 
 
గతంలో వరంగల్ సభలో ఇదే కేసీఆర్‌ను బట్టలిప్పిచ్చి కొడతామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి గుర్తు చేశారు. పవన్ చేసిన కామెంట్స్‌తో వరంగల్‌లో కేసీఆర్‌కు సానుభూతి ఓట్లు కూడా పడ్డాయన్నారు. ఇంతలోనే పవన్‌కు కేసీఆర్ అంతగా నచ్చేశారా? అని ప్రశ్నించారు. ''అజ్ఞాతవాసి'' సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకే కేసీఆర్‌తో పవన్ భేటీ అయ్యారని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు