అన్నేళ్లపాటు గమ్మునుండి రమణ దీక్షితులు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారబ్బా?

సోమవారం, 21 మే 2018 (15:25 IST)
అర్చక వివాదం టిటిడిని కుదిపేస్తోంది. ప్రభుత్వంలోను సెగలు రేపుతోంది. రమణదీక్షితులు ఆరోపణలతో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారి సీనియర్ అర్చకులను తొలగించేదాకా వెళ్ళింది. శ్రీవారి సేవా కైంకర్యాల మొదలు, ఆభరణాల వ్యవహారంలోను అనేక లొసుగులు ఉన్నాయంటూ రమణదీక్షితులు బాంబు పేల్చడంతో ఆ ఆరోపణలకు వివరణ ఇచ్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు టిటిడి అధికారులు. అసలు టిటిడిలో ఏం జరుగుతుందో... రమణదీక్షితుల ఆరోపణలలో ఎంత నిజం ఉంది. టిటిడి ఉన్నతాధికారుల వివరణ సరైందేనా..? 
 
నెలరోజులుగా దుమారం రేగుతున్న టిటిడి అర్చకులు, ఉన్నతాధికారుల మధ్య వివాదం పతాకస్థాయికి చేరుకుంది. విఐపిల మెప్పు కోసం టిటిడి అధికారులు సనాతన ఆచారాన్ని, పరిస్థితులను తుంగలో తొక్కుతున్నారన్న రమణదీక్షితుల ఆరోపణలతో మొదలైన వివాదం చివరకు అర్చకులను తొలగించేదాకా వెళ్ళింది. అక్కడితో ఆగకుండా శ్రీవారికి చక్రవర్తులు, రాజులు సమర్పించిన ఆభరణాలపైన అనుమానాలు రేకెత్తించే వరకు వెళ్ళింది. 
 
తిరుమల ఆలయంలో ఆగమ పద్థతులు ఏవీ పాటించడం లేదని మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను తప్పు బడుతున్నారు టిటిడి అధికారులు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రమణదీక్షితులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఇప్పటికే ఆయన్ను తొలగించిన టిటిడి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు రమణదీక్షితులు. టిటిడి తీరుపై సుప్రీంకోర్టుకు వెళతానని, అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తానని అంటున్నారాయన. అసలు రమణదీక్షితులకు, టిటిడి మధ్య ఏం జరిగింది. వ్యవహారం ఎక్కడ చెడింది. సుదీర్ఘ కాలంగా తిరుమలలో ప్రధాన అర్చకునిగా ఓ వెలుగు వెలిగిన రమణ దీక్షితులు ఉన్నఫలంగా ఆరోపణలు గుప్పించడానికి కారణమేమిటి.  
 
ఇక అసలు వివాదానికి వస్తే.. తిరుమల శ్రీవారి ఆలయంలో తరతరాలుగా నాలుగు వంశాలకు చెందిన అర్చక కుటుంబాలే శ్రీవారికి సేవలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ వంశానికి చెందిన వ్యక్తులు మాత్రమే తిరుమలలో సేవా కైంకర్యాలు నిర్వహించి స్వామివారిని తాకి అభిషేక సేవ చేసే భాగ్యం దక్కుతోంది. ఈ వరాన్ని సాక్షాత్తు స్వామివారే వంశ మూలపురుషుడైన వైఖానస మహర్షికి పుట్టాడని స్థల పురాణం చెబుతోంది. అప్పటి నుంచి వైఖానస ఆగమం ప్రకారమే తిరుమల ఆలయంలో పూజా విధానం జరుగుతూ వస్తోంది. అయితే దీన్నే మిరాశీ వ్యవస్థగా కూడా భావిస్తారు. 
 
అయితే 1996లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారాన్నే రేపింది. అర్చకులు భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఆర్ అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపైన ఆగ్రహించిన అర్చకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని సమర్థించడంతో వ్యవహారం ఇంకాస్త ముదిరింది. అయితే ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్చకులకు సపోర్ట్‌గా జిఓలను సవరణ చేసి కోర్టుకు పంపించడంతో కోర్టు కూడా వంశపారపరపర్యానికి అనుమతిస్తూ అర్చకులకు అనుగుణంగా తీర్పు ఇచ్చింది. 
 
అయితే ఆ తరువాత ఈ వ్యవహారం జోలికి ఎవరూ వెళ్ళలేదు. అయితే తాజాగా టిటిడి మళ్ళీ తేనెతుట్టెను కదిలింది. మిగతా ఉద్యోగుల మాదిరిగా అర్చకులకు 65 యేళ్ళ వయోపరిమితిని నిర్ణయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఖాళీ అయిన స్థానంలో అదే నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులను నియమిస్తామని తెలిపారు అధికారులు. దీనివల్ల యువ అర్చకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అయితే దీనిపైన రమణదీక్షితులతో పాటు అర్చక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. 
 
టిటిడి మాజీ ఈఓ ఐవైఆర్ క్రిష్ణారావు కూడా టిటిడి వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అర్చకులు శక్తి ఉన్నంతవరకు స్వామి కైంకర్యాలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. అయితే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అర్చకులను పరిగణించలేమని, ఉద్యోగుల మాదిరిగా అర్చకులను జీతభత్యాలను, ఇతర అలవెన్సులు గానీ, రిటైర్డ్ బెనిఫిట్స్‌గానీ ఉండవని అంటున్నారు. కేవలం సంభావన మాత్రమే అర్చకులు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆలయంలో జియ్యంగార్ల వ్యవస్థ, గొల్ల జియ్యంగార్లు, సన్నిధి గొల్లలు వంశపారపర్యంగా వయో నిబంధనలు లేకుండా స్వామి సేవ చేస్తున్నారని, అదే నియమం అర్చకులకూ వర్తిస్తుందని, స్వామివారు నిర్ధేశించిన ఈ విధానం కాదనే హక్కు ఎవరికీ లేదని వాదిస్తున్నారు.
 
రమణదీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. అభివృద్థి పేరుతో సనాతన నిర్మాణాలను, ప్రాకారాలను పునాదులతో సహా పెకిలించి వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు శ్రీవారి వెయ్యికాళ్ళ మండపంతో పాటు పలు నిర్మాణాలను తొలగించారు. అలాగే శ్రీవారి మాఢా వీధులలో రాతి రథమండపాన్ని తొలగించారని వాటిని పునర్నిస్తామని తెలిపినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదంటున్నారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అధికారులే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చివరకు స్వామి ఆలయంలో స్వామి ఆలయంలో తయారుచేయాల్సిన ప్రసాదాలను ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా బయట చేసి ఆలయంలోకి తీసుకువస్తున్నారన్నారు. 
 
గర్భాలయం పక్కన ఉన్న పోటును 25 రోజులుగా ఎందుకు మూసేశారని ప్రశ్నిస్తున్నారు. వంటవారు, అర్చకులు తప్ప నైవేద్యానికి వినియోగించే ప్రసాదాలను ముందుగా వేరొకరు చూడకూడదని కానీ అలాంటి నిబంధనలు ఏవీ ఆలయంలో అమలు కావడం లేదంటున్నారు. ఇంతటితో ఆగకుండా మరో బాంబు పేల్చారు రమణదీక్షితులు. శ్రీవారి గరుడ సేవలో వినియోగించే ఐదు వరుసలు వజ్రాలు పొదిగిన ప్లాటినం హారంలో గులాబీ వజ్రం మాయమైందని, ఎలా మాయమైందని ప్రశ్నిస్తున్నారు. ఈమధ్యన జెనీవాయాలోని ఎగ్జిబిషన్‌లో గులాబీ వజ్రాన్ని ప్రదర్శించారని, అది అచ్చం శ్రీవారి హారంలోని వజ్రంలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 
 
అయితే రమణదీక్షితులు ఆరోపణల్లో ఏవీ వాస్తవం కాదంటున్నారు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. 1956 టిటిడి నిబంధనల ప్రకారం ఉద్యోగులతో పాటు అర్చకులకు ఒకే తరహా నిబంధనలు వర్తిస్తాయన్నారు. అలాగే 2013 జనవరిలో జిఓ నెంబర్ 611 ప్రకారం అర్చకులకు 65 సంవత్సరాలకు రిటైర్మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీని ప్రకారమే గతంలో ఎ.ఎస్. రమణదీక్షితులు, భక్తవత్సల దీక్షితులు, రామచంద్ర దీక్షితుల రిటైర్మెంట్ జరిగిందన్నారు. రిటైర్ అయిన అర్చకుల స్థానంలో వారి కుటుంబంలోని వారినే నియమించామన్నారు. 1956 తిరువాభరణం రిజిస్ట్రర్ ప్రకారం ఆభరణాలను విరాళాలుగా ఇచ్చిన వారి పేర్లు టిటిడి వద్ద లేవన్నారు. 
 
2001 సంవత్సరంలో గరుడ సేవ సంధర్భంగా హారంలోని గులాబీ వజ్రం భక్తులు నాణేలు విసరడం వల్ల పగిలిందని, ఆ ముక్కలు ఇప్పటికీ టిటిడి వద్దే ఉన్నాయన్నారు. త్వరలోనే భక్తులకు శ్రీవారి ఆభరణాలన్నింటినీ ప్రదర్సిస్తామని తెలిపారు. అలాగే 1979 మార్చి 1 రూల్స్ ప్రకారం శ్రీవారి ఆలయంలో సేవలకు సంబంధించి నిర్థిష్ట సమయాన్ని కేటాయించారన్నారు అనిల్ కుమార్ సింఘాల్. వాటి ప్రకారమే ఇప్పటికీ ఉదయం సుప్రభాతసేవ నుంచి రాత్రి పవళింపుసేవ వరకు క్రమం తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. సేవా సమయాలను కుదిస్తున్నామన్న రమణదీక్షితుల ఆరోపణలు అర్థరహితమన్నారు. మొత్తం మీద టిటిడి చర్యల నేపథ్యంలో భవిష్యత్తులో రమణదీక్షితులు ఏ విధంగా ముందుకు పోతారన్నది ఆసక్తికరంగా మారుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు