ఆ విషయంలో కేసీఆర్ పైన జగన్‌కు అనుమానాలు... ఎందుకంటే?

శనివారం, 29 జూన్ 2019 (17:24 IST)
రెండు తెలుగురాష్ట్రాల్లోను కెసిఆర్, జగన్‌ల భేటీ.. కలిసి ముందుకు సాగుతున్న వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే ఎపిలో నెలకొన్న సమస్యల దృష్ట్యా జగన్ మోహన్ రెడ్డికి కెసిఆర్ పైన కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయట. ఇంతకీ ఆ అనుమానాలు ఏంటంటే.. గోదావరి నీటిని ఎత్తిపోతల పధకం ద్వారా దిండి ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలో కలుపుతారు. 

ఫలితంగా తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు నీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. శ్రీశైలంలో నీటిని నిల్వ ఉంచడం వలన రాయలసీమ ప్రాజెక్టుల కోసం వాడుకోవచ్చు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి, కృష్ణా డెల్టాలకు నీరు ఇవ్వవచ్చు. ప్రతిపాదనలు బాగున్నా ఆచరణలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
 
రాయలసీమ నీటి కష్టాలకు రాజకీయ నాయకులు చెపుతున్నది కృష్ణలో నీటి లభ్యత తగ్గడం వలన. కనుక గోదావరి నుంచి శ్రీశైలంకు నీరు తరలించాలి అంటున్నారు. ఈ వాదనలో నిజం లేదు. ప్రతి ఏటా శ్రీశైలం నుంచి వందల టీఎంసీల నీరు సాగర్ జలాశయంకి వదులుతున్నారు. తుంగభద్ర పుష్కలంగా నీటిని తీసుకువస్తుంది కాని రాయలసీమకు నీరు అందడంలేదు. అందుకు కారణం శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం నిర్వహణ చేయకపోవడం వల్ల మాత్రమే. అది కృష్ణ నీరు అయినా గోదావరి నీరు అయినా ఈ కీలక నిర్ణయం జరగడమే ప్రధానం.
 
హక్కుగా ఉన్న తుంగభద్ర నీటి నిల్వకు గుండ్రేవుల, అనంత అవసరాల కోసం సమాంతర కాలువ, అదేవిధంగా సిద్దేశ్వరం నిర్మాణం జరగాలి. గాలేరు-నగరి, హంద్రీనీవాను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు తూముల వెడల్పు జరగాలి. పోలవరం, పట్టిసీమ, గోదావరి నీరు అని ఎన్ని చెప్పినా రాయలసీమలో పైనిర్మాణాలు చేయకుండా నీరురాదు. కానీ రాజకీయ నాయకులు ఇది తప్ప మిగిలిన విషయాలు మాట్లాడుతున్నారు.
 
రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి పోతిరెడ్డిపాడు తూముల వెడల్పు, గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై కేసీఆర్ మొదటి నుంచి వ్యతిరేకత వైఖరి అవలంభిస్తున్నారు. అసలు గాలేరు-నగరి, హంద్రీనీవాకు నీటి హక్కు లేదని వాదించిన సందర్భాలు అనేకం. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకం అనుకున్న దుమ్ముగూడెం నాగార్జున సాగర్ పథకాన్ని నీరుగార్చి కేవలం తెలంగాణ అవసరాలకు అనుగుణంగా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని అమలు చేశారు. అలాంటి వ్యక్తి నేడు రాయలసీమ విషయంలో సానుకూలంగా స్పందించారు అంటే సహజంగానే సీమ ఉద్యమ నేతలలో అనుమానం కలుగుతోంది. 
 
తెలంగాణ రాష్ట్రం దిండి, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి పూనుకుంది. దానికి 90 టీఎంసీల నీరు అవసరం. కృష్ణలో వాటి అవసరాలకు సరిపడ నీటి లభ్యత అనుమానమే. అందుకే గోదావరి నీటిని భారీ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ పథకానికి నీరు తీసుకువచ్చే ప్రయత్నం. అది జరగాలంటే ఏపీ సహకారం కావాలి. అందుకోసం రాయలసీమ అవసరాలు అంటూ వాదన తెస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ప్రతి రాష్ట్రం వారి అవసరాలకు అనుగుణంగా వాదనలు వినిపిస్థాయి. ఇక్కడ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయాల్సింది. తన అవసరాల కోసం కేసీఆర్ ముందుకు వచ్చారు. కనుక రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన పైప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పమని కోరాలి. అందుకు అనుగుణంగా రాయలసీమ నీటి వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ట్రిబ్యునల్ ముందు తాను చేసిన వాదనలు వెనిక్కి తీసుకోవాలని అడగాలి. అందుకు కేసీఆర్ అంగీకారాన్ని తెలిపితేనే ముందుకు వెళ్లడం మంచిది. అలా కాకుండా ముందుకు వెళితే రాయలసీమ అవసరాలపేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నం ఎప్పటిలాగే పేరు రాయలసీమ... ప్రయోజనం మాత్రం మరొకరికి అన్నట్లు అవుతుంది.
 
పోలవరం... ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మారింది కనుక ఎవరి సహకారం లేకపోయినా కేంద్రం సహకరిస్తే పూర్తి అవుతుంది. కృష్ణా డెల్టాకు గోదావరి, ఉత్తరాంధ్ర అవసరాలకు అవసరం అయ్యే నీరు అందుబాటులోకి వస్తుంది. ఇక మిగిలింది రాయలసీమ. పోలవరం అందుబాటులోకి వస్తే కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసే నీటిని పూర్తిగా నిలుపుదల చేయవచ్చు. తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో రాయలసీమకు వినియోగించడానికి వీలుగా సమాంతర కాలువ, గుండ్రేవుల నిర్మాణం. జోలదరాసి , ఆదినిమ్మాయని బ్యారేజి నిర్మాణం చేయడంతో నీటిని వాడుకోవచ్చు. 
 
మిగిలిన సీమ, వెలుగొండ ప్రాజెక్టుల కోసం పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి గాలేరు నగరి, హంద్రీనీవా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి శ్రీశైలంలో 854లో అడుగుల నీటి మట్టం నిర్వహణకు చర్యలు చేపడితే రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాలోని వెలుగొండ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ ఏపీ ఉమ్మడి ప్రయోజనాల కోసం దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలి. 
 
గోదావరి నదీజలాలను పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించే ఆలోచనలు మంచివే. కానీ గత అనుభవాలను మరిచిపోకూడదు. రాజకీయ పార్టీలన్న తర్వాత వారి ప్రయోజనాలు వారికి ఉంటాయి. గోదావరి నీటిని ఉపయోగించుకునే విషయంలో, కేంద్రంలో మారిన రాజకీయ సమీకరణాలు కారణంగా కేసీఆర్ ఏపీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నారు. మంచిదే... ఈ రాజకీయ సమీకరణాలు ఇలానే ఎప్పుడూ ఉండవు. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో చేసుకునే ప్రతి అవగాహన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సాగాలంటున్నారు విశ్లేషకులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు