విజయనిర్మలకు జగన్ పుష్పాంజలి.. వైఎస్సార్ అంటే ఎంత అభిమానమంటే?

శుక్రవారం, 28 జూన్ 2019 (11:22 IST)
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లిన జగన్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం విజయనిర్మల కుమారుడు నరేశ్‌ను, సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చారు. జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉండటం గమనార్హం.  
 
ఇంకా విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. తన తల్లికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని నటుడు నరేశ్, జగన్‌కు వివరించారు. అంతేగాకుండా ఇంట్లోని ఓ టేబుల్‌పై పూలమాలలు వేసివున్న వైఎస్ చిత్రపటాలను జగన్‌కు చూపించారు. ఈ సమయంలో జగన్ సైతం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా నరేష్ ఓదార్చారు. 
 
కాగా, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికీ మంచి సాన్నిహిత్యం ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో వైఎస్ తో చాలా దగ్గరగా ఉండేవారు. ఏలూరు నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించేందుకు వైఎస్ కూడా కారణమేనని అప్పట్లో కృష్ణ చెప్పేవారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు