హైదరాబాద్ : నోట్ల రద్దు జరిగిన 15 రోజులకు ప్రతిపక్షనేత జగన్ స్పందించడం ఏపీలో చర్చానీయాంశం అయింది. ఇన్నాళ్ళూ తేలు కుట్టిన దొంగలా జగన్ నిద్ర నటించాడని అధికార టీడీపీ నాయకులు విమర్శించారు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఏమైపోయాడని ఎద్దేవా చేశారు. కానీ, జగన్ ఏమాత్రం తొణకలేదు... బెణకలేదు. నోట్ల రద్దు పర్యవసానం ఎలా ఉంటుందో వేచిచూచి.... ఆచితూచి స్పందించేందుకే తాను టైం తీసుకున్నానని వివరణ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల కష్టాలపై స్పందించాలని ఎదురుదాడి చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య ద్వారా నోట్ల రద్దు విషయం ముందే తెలుసుకుని, చంద్రబాబు అంతా సర్దుకున్నారని ఆరోపించారు. దీనికి నిదర్శనం... మూడు రోజుల ముందు హెరిటేజ్ షేర్ల అమ్మకం అని పేర్కొన్నారు.
అసలు జగన్ ఇన్ని రోజుల తాత్సారం వైఫల్యమా? వ్యూహాత్మకమా? అనేది పరిశీలించాలంటే... దానికి ముందు అధికార పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తడబాట్లను గమనించాల్సి ఉంటుంది. నోట్ల రద్దు అయిన వెంటనే చంద్రబాబు చాలా వేగంగా స్పందించారు. నేనే పెద్ద నోట్లు రద్దు చేయాలని చెప్పా... చాలామంచి జరిగింది అంటూ క్రెడిట్ కోసం తొందరపాటును ప్రదర్శించారు. తీరా ఇపుడు 10 రోజులకు సమస్య తీవ్రం కావడంతో తన అసహనాన్ని సీఎం ప్రకటించారు. కేంద్రంపై రివర్స్ కావాలని తన పార్టీ సీనియర్లకు సంకేతాలు ఇచ్చారు.
ఇందులో భాగంగానే ఎంపీ శివప్రసాద్‌తో పాటు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇతర నేతలు బాహాటంగా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారు. అంటే, పది రోజుల క్రితం ఇలా జరుగుతుందని గమనించక టీడీపీ నేతలు నోట్ల రద్దును సమర్ధించినట్లయింది. ఇపుడు అదే పార్టీ నాయకులు వ్యకతిరేకిస్తుండటంతో వారి నిలకడలేని, ముందుచూపు లేనితనాన్ని బయటపెట్టినట్లయింది.
చంద్రబాబు ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్‌తో అంతా సర్దేసుకున్నారని... జగన్ తన ప్రెస్ మీట్లో పదే పదే నొక్కి చెప్పారు. ఐతే జగన్ తన వాయిస్‌ను ఆలస్యం చేయడం వల్ల, వైసీపీ ఒకటే స్టాండ్ తీసుకున్నట్లయిందని పార్టీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బాగుంటే నా గొప్ప అని, లేదంటే మోదీ తప్పన్నట్లు చంద్రబాబు వ్యవహరించడం ఇక కుదరదని జగన్ తెగేసి మరీ చెపుతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని నేనే చెప్పా అన్న చంద్రబాబే, ఇపుడు ఈ ఆర్ధిక సంక్షోభానికీ బాధ్యత వహించాలని డిమాండు చేస్తున్నారు. మొత్తంమీద నోట్ల రాజకీయం కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వైసీపీ ఒక మెట్టు ఎక్కువే హిట్ అయిందని చెప్పొచ్చు.