మతాబులు.. చిచ్చుబుడ్లు... ఔట్లు.... కాల్చే ముందు...

మరో రెండు రోజుల్లో దీపావళి వచ్చేస్తుంది. ఇంట్లో రకరకాల పిండివంటలు, బంధువుల సందడి, టపాకాయల మోత పూర్తి పండుగ వాతావరణం. మిగతా అన్ని పండుగలతో పోలిస్తే దీపావళి పండుగనే ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవడానికి పిల్లలు మక్కువ చూపుతారు. టపాకాయలు కాలుస్తూ.. ఆనందంతో కేరింతలు వేస్తుంటారు.

మరి ఇలాంటి ఆనందకరమైన వాతావరణం ఒక్కోసారి అశ్రద్ధ వల్లనో లేక అవగాహన లోపం వల్లనో విషాదకర వాతావరణంగా మారుతుంటుంది. ప్రతిసారి చెప్పేవే అయినా.. మీకోసం కొన్ని సలహాలు సూచనలు.

టపాకాయలు కొనుగోలు చేసేటప్పుడు వీలైనంత వరకూ బ్రాండెడ్ వాటినే కొనుగోలు చేయండి. లైసెన్స్‌ కలిగి ఉన్న దుకాణాల నుంచి కోనుగోలు చేస్తే మరీ మంచిది.

పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు బాణా సంచా కాల్చేలా జాగ్రత్త వహించండి. వాటిని ఎలా ఉపయోగించాలో వారికి అవగాహన కల్పించండి.

ఇంట్లో పసికందులు ఉంటే.. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే 'ఢాం' టపాసులను కొనకండి. చిచ్చుబుడ్లు, మతాబులు వంటి శబ్ద రహిత టపాకాయలను ఉపయోగించండి.

భూ చక్రాలను కాల్చేటప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు.

టపాకాయలను వీలైనంత వరకూ ఖాళీ ప్రదేశాలలో కాల్చండి. ఔట్లు, రాకెట్లు వంటి భారీ బాంబులను కాల్చే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.

ముఖ్యంగా.. మతాబులు, చిచ్చుబుడ్లు, వంటి టపాకాయలు కాల్చేపుడు ఎగిసిపడే నిప్పు రవ్వలు కంటిలో పడకుండా శ్రద్ధ వహించాలి.

మతాబులు వెలుగును ఎక్కువసేపు కంటితో చూడటం మంచిది కాదు. అలాంటప్పుడు నళ్ల కళ్లజోళ్లను వాడండి. కానీ బాణా సంచా కాల్చడానికి ముందు నళ్ల కళ్లజోళ్లు వాడటం మంచిది కాదు.

పేలని టపాకాయలే కదా ఏంచేస్తాయిలే అని.. చిచ్చుబుడ్లు వంటి వాటిని.. చేతితో కాల్చి ప్రమాదాలు తెచ్చుకోకండి. ఇలాంటివి ఒక్కోసారి పేలే ప్రమాదం ఉంది.

ప్రమాద వశాత్తు.. టపాకాయలు పేలి శరీరంపై గాయలయినా.. లేదా రేణువులు కంటిలో పడినా వెంటనే ప్రధమ చికిత్స చేసి దగ్గర్లోని వైద్యునిపుణులను సంప్రదించాలి.

బాణాసంచా కాల్చేముందు పాత కాటన్‌ వస్త్రాలను మాత్రమే ధరించండి. సిల్క్ దుస్తులు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి.

ఒకవేళ వస్త్రాలకు నిప్పు అంటుకుంటే పరుగుపెట్టకుండా నేలపై దొర్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించండి.

బాణాసంచా కాల్చేముందు పెద్దలు, యువత మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం మత్తులో ప్రమాదాలు ఎక్కుగా జరగడానికి ఆస్కారం ఉంది.

టపాకాయాలు కాల్చే ప్రాంతంలో వెంటనే తగులబడే వస్తువులు ఏవైనా ఉంటే వాటిని దూరంగా ఉంచండి. గాలి ఎక్కువగా వీస్తుంటే.. బాణాసంచా కాల్చకండి.

ఎక్కువ శబ్దం వచ్చే బాంబులు పేల్చే సమయంలో వచ్చే శబ్దం ఇంట్లోని చిన్న పిల్లలు, వృద్దులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత వరకూ ధ్వని కాలుష్యాన్ని నివారించండి.

పేలని టపాకాయలను అలానే వదిలివేయండి. వాటిని ముట్టుకోవడం, విప్పి చూడటం వంటి చేయడం అత్యంత ప్రమాదకరం.

చివరగా.. బాణాసంచాలో ఉండే సల్ఫర్ పర్యావరణానికి హాని కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో టపాకాయలు కాల్చి పర్యవరణానికి హాని తలపెట్టుకండి.

ఈ దీపావళి మీ అందరికీ సిరిసంపదలను తేవాలని, మీ జీవితం ఆనందమయం కావాలని, ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ...

దీపావళి శుభాకాంక్షలతో..
మీ వెబ్‌దునియా..

వెబ్దునియా పై చదవండి