అదిరేటి డ్రస్సు నేనేస్తే... ఆవు పేడతో అద్భుతమైన డ్రెస్

శనివారం, 4 ఆగస్టు 2018 (13:23 IST)
టెక్స్‌టైల్ ఫ్యాషన్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఫలితంగా వివిధ రకాల వస్తువుల నుంచి కొత్తకొత్త దుస్తులను తయారు చేస్తున్నారు. చివరకు ఆవు పేడతో కూడా అదిరిపోయే డ్రెస్‌ను తయారు చేయడం జరిగింది. పైగా, ఈ డ్రెస్ ఏకంగా రూ.1.40 కోట్ల నగదు బహుమతిని కైవసం చేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నెదర్లాండ్‌లోని ఒక స్టార్టప్ కంపెనీ ఆవు పేడ నుంచి సెల్యూలోజ్ వేరుచేసి, దానితో ఫ్యాషనబుల్ డ్రెస్‌లను రూపొందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నెదర్లాండ్‌కు చెందిన బయోఆర్ట్ ఎక్స్‌పర్ట్ జలిలా ఎసాయిదీ ఈ స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఈ స్టార్టప్ కంపెనీ ఈ వినూత్న దుస్తులను తయారుచేసింది. 
 
ఈ నూతన ఆవిష్కరణకు చివాజ్ వెంచర్ అండ్ హెచ్ఎం ఫౌడేషన్ గ్లోబల్ అవార్డు పురస్కారంతోపాటు, రూ.1.40 కోట్ల నగదు బహుమతి లభించింది. కాగా, జలిలా దీనిని ఫ్యూచర్ ఫ్యాబ్రిక్‌గా పేర్కొంటున్నారు. ఆవు పేడతో బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్, పేపర్ రూపొందించవచ్చని తెలిపారు. ఆవు పేడతో రూపొందించిన దుస్తులు ఎంతో అందంగా ఉంటాయని జలిలా చెప్పుకొచ్చారు. 
 
నిజానికి ఇటీవలి కాలంలో ఆవు పడేతో పాటు.. గో మూత్రానికి ఎంతో ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గోమూత్రం, పేడ కూడా అత్యంత విలువైనవిగా మారిపోతున్నాయి. ఆవుపేడ పొలాల్లో క్రిమిసంహారిణిగా ఉపయోగిస్తున్నారు. ఇపుడు ఆవు పేడతో దుస్తులు తయారు చేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు