ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ : ఫ్రాన్స్ వర్సెస్ క్రొయేషియా...
ఆదివారం, 15 జులై 2018 (11:35 IST)
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఫ్రాన్స్ వర్సెస్ క్రొయేషియా జట్లు తలపడనున్నాయి. మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మార్ తదితర స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్లన్నీ ఇంటిముఖం పట్టగా… లుకా మోడ్రిక్ కెప్టెన్సీలో క్రొయేషియా, హ్యూగో లారిస్ ఆధ్వర్యంలో ఉన్న ఫ్రాన్స్ ఫైనల్లో నిలిచాయి.
ఫైనల్ పోటీని చూసేందుకు ప్రపంచం నలుమూలలనుంచి రష్యా చేరుకున్న అభిమానులతో రష్యా రంగులమయంగా మారింది. రెండు యూరోపియన్ దేశాల నడుమ సాగనున్న ఈ ఫైనల్ పోరులో ఏ దేశ జట్టు గెలిచినా కప్ తమ ఖండానికే వస్తుందని ఆ జట్లు భావిస్తున్నాయి. చివరిసారిగా 1998లో ట్రోఫీ గెలిచిన ఫ్రాన్స్ మరోసారి కప్ గెలవాలని ఆశిస్తోంది.
ఈ మ్యాచ్‌తో నెల రోజులకు పైగా సాగిన సాకర్ సమరం ముగియనుంది. నెలరోజులుగా ఉత్కంఠగా సాగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సమరంలో హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌తో సంచలనాల క్రొయేషియా తలపడనుంది. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఆదివారం రాత్రి రెండుజట్లూ హోరాహోరీ పోరాటంతో సాకర్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి.
కాగా, సూపర్ ఫాంతో దూసుకెళుతున్న ఫ్రాన్స్ స్ట్రైకర్లు ఎంబాప్పే (3గోల్స్), ఆంటోనీ గ్రీజ్‌మన్ (3గోల్స్) ఫైనల్ పోరులోనూ కీలకపాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తున్నది. వీరికితోడుగా డిఫెండర్లు అద్భుత సమన్వయంతో అదరగొడుతుండగా.. గోల్‌కీపర్ లోరిస్ ప్రత్యర్థి ఆటగాళ్లకు సింహస్వప్నంలా మారాడు.
క్రొయేషియాతో పోల్చితే అన్నిరంగాల్లోనూ ఫ్రాన్స్ బలంగా కనిపిస్తున్నది. కాగా, మోడ్రిచ్ సారథ్యంలో పూర్తిస్థాయి పోరాటంతో ఆకట్టుకుంటున్న క్రొయేషియా తొలిసారి చాంపియన్‌గా నిలువాలని తపిస్తోంది. జట్టుగా ఆడడంలోనే వారి బలం అంతా ఉంది.
ఇదిలావుంటే, సెమీస్‌లో పరాజయంతో మూడోస్థానం కోసం వర్గీకరణ మ్యాచ్‌లో శనివారం రాత్రి బెల్జియం, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 2-0 గోల్స్‌లో రెడ్‌డెవిల్స్ జట్టు విజయంతో మూడోస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్‌లో నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది.
మ్యాచ్ 4వ నిమిషంలో థామస్ మునెర్, మ్యాచ్ 84వ నిమిషంలో ఈడెన్ హజార్డ్ గోల్ కొట్డడంతో బెల్జియం జట్టు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం అందుకుంది. ప్రపంచకప్‌లో తొలిసారి మూడోస్థానంతో సంతృప్తి చెందింది.