ఆంధ్రాలో అగ్గి రాజేసిన మూడు రాజధానుల చిచ్చు

గురువారం, 26 డిశెంబరు 2019 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్గిరాజుకుంది. దీనికి కారణం మూడు రాజధానుల మాట. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధాని అమరావతి ప్రాంతంలో తీవ్ర కల్లోలం సృష్టిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, బీజేపీ నేతలు ఆగ్రహిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ప్రాంతాలవారీగా స్వరాలు వినిపిస్తున్నాయి. దీంత టీడీపీ అధినేత చంద్రబాబు మినహా మిగిలిన పార్టీల నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. 
 
కొన్ని పార్టీల్లో నేతలు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటే.. మరికొన్ని పక్షాల్లో అధినేతలకు భయపడి పెదవి విప్పడంలేదు. తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైన మూడు రాజధానుల భిన్న స్వరాలు సమైక్యాంధ్ర ఉద్యమం నాటి సంగతులను గుర్తుకు తెస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27వ తేదీన జరిగే ఏపీ మంత్రివర్గం సమావేశం తర్వాతే తన వైఖరిని వెల్లడించనున్నట్టు ప్రకటించారు.
 
ఈ మూడు రాజధానుల అంశంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైగా, తన అభిప్రాయాన్ని కేంద్రానికి తెలుపనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణకు బదులుగా.. పాలన వికేంద్రీకరణ జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనతో వెంకయ్య సైతం ఏకీభవించారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని, పాలన మాత్రం ఒకేచోట ఉండాలని సూచించారు. 
 
శాసనసభ శీతాకాల సమావేశాల్లో చివరిరోజు అమరావతిపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ముచ్చటను లేవనెత్తారు. విశాఖపట్టణంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉండొచ్చు అని ఆయన చెప్పారు. సరిగ్గా సీఎం చెప్పిన అంశాన్నే.. జీఎన్ రావు కమిటీ కూడా తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
 
దీంతో రాష్ట్రంలో రాజధాని చిచ్చు చెలరేగింది. దానికితోడు తెలుగుదేశం పార్టీలో సైతం అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. మూడు రాజధానుల ముచ్చటను ఉత్తరాంధ్రకు చెందిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. విశాఖ సర్వతోముఖాభివృద్ధికి సీఎం జగన్ చేసిన ప్రతిపాదన తోడ్పడుతుందన్నారు.
 
అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, తెలుగుదేశం నేత కొండ్రు మురళి మోహన్ కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ముఖద్వారమైన విశాఖపట్టణానికి.. పాలనా రాజధాని రావడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ప్రతిపాదనను మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి స్వాగతించారు. వైకాపా నేతలు మాత్రం అధినేతకు భయపడి నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. మొత్తంమీద మూడు రాజధానుల అంశం ఇపుడు ఆంధ్రాలో చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు