"జురాసిక్ పార్క్" క్రైటన్ ఇక లేరు

శుక్రవారం, 7 నవంబరు 2008 (12:35 IST)
పిల్లలూ...! "జురాసిక్ పార్క్" గురించి మీకు తెలిసే ఉంటుంది. 1993 సంవత్సరం మొదట్లో వెండితెరపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ హిట్ సాధించింది. ఈ సినిమాలోని పెద్ద పెద్ద డైనోసార్లు అటు ఇటుగా తిరుగుతూ, మనుషుల్ని చీమల్లాగా నలిపేసే సన్నివేశాలు చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరిలో ఒకింత ఆశ్చర్యం, మరింత భయాన్ని కలిగించాయి.

ఈ జురాసిక్ పార్క్ సినిమా కంటే ముందుగా జురాసిక్ పార్క్ అనే నవల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నవల ఆధారంగానే జురాసిక్ పార్క్ సినిమాను రూపొందించాడు స్టీవెన్ స్పీల్‌బర్గ్. జురాసిక్ పార్క్ సినిమా గురించే మనందరికీ బాగా తెలుసుగానీ, ఆ కథను రాసిన మైకేల్ క్రైటన్ గురించి మాత్రం అంతగా తెలియక పోవచ్చు.

జురాసిక్ పార్క్ సినిమాకు రెండో భాగంగా "ది లాస్ట్ వరల్డ్" అనే సినిమా కూడా వచ్చింది. ఇది కూడా క్రైటన్ కలం నుంచే జాలువారింది. రచయితగా అనేక సంచలనాలు సృష్టించిన ఈ సుప్రసిద్ధ హాలీవుడ్ రచయిత మైకేల్ క్రైటన్ నవంబర్ 6వ తేదీన లాస్‌ఏంజెల్స్‌లో మరణించారు. ఈయన వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు కాగా, భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

1942వ సంవత్సరంలో షికాగోలో జన్మించిన క్రైటన్ హార్వర్డ్ యూనివర్శిటీలో వైద్యశాస్త్రం చదువుకున్నారు. వైద్యశాస్త్రం చదువుకుంటున్న రోజుల్లోనే ఆయన 1969లో తన తొలి పుస్తకం "ది అడ్రొమెడా స్రెయిన్"ను రచించారు. ఆ తరువాత జురాసిక్ పార్క్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

క్రైటన్ రాసిన అనేక పుస్తకాల్లో కొన్ని పదికోట్ల కాపీలకు పైగా అమ్ముడుబోయాయి. అంతేగాకుండా ఈయన రాసిన సైన్ ఫిక్షన్ నవలలు విద్యార్థులనే కాకా శాస్త్రవేత్తలను కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ కాకుండా క్రైటన్ పలు విజయవంతమైన టీవీ సీరియల్స్‌కు కూడా కథలు రాశారు.

వెబ్దునియా పై చదవండి