పిల్లలూ...! "నమిలే వానికన్న మింగేవాడే ఘనుడు" అనే సామెత నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు ఓ చక్కటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల స్వభావానికి దగ్గరగా ఉన్న ఈ సామెత... నేడు రాజకీయాల్లో నీతి 'నేతి బీరకాయ ' అని అందరికీ తెలుసు. అదే విధంగా సమాజంలో మిగతా వ్యక్తుల్లో కూడా ఎదుటి వాళ్లను వంచించి, వారి ఆస్తిపాస్తుల్ని, కాజేసేవారు లేకపోలేదు. అటువంటి వారి గురించి చెప్పేదే ఈ సామెత.
ఒకరిని మించి ఒకరు దోపిడి చేసే వారుంటారని ఈ సామెత హెచ్చరిస్తుంది. కొందరు చాలా లౌక్యంగా, జనం పసికట్టకుండా జాగ్రత్తపడుతూ ఎదుటివాళ్లను మోసం చేస్తారు. మరికొందరు బాహటంగా, ఉన్నదాన్ని పూర్తిగా మాయం చేయటంలో దిట్టలు అని ఈ సామెత అర్ధం.
మరోవిధంగా చెప్పుకోవాలంటే... "గుడిని మింగేవాడుంటే, గుళ్లో లింగాన్నే మింగేవాళ్లు మరికొందరని" చెప్పే సామెత వంటిదే ఇది. కాబట్టి మానవులందరూ మంచివాళ్లే అనుకోకుండా... వాళ్ల స్వభావాలు జాగ్రత్తగా కనిపెట్టి సమాజంలో జీవించాలనే మంచి నీతి ఈ సామెతలో దాగి ఉంది.