"హెల్మెట్" ఎందుకు వాడతారు?

గురువారం, 20 నవంబరు 2008 (15:30 IST)
శరీరంలోని అన్ని అవయవాలకంటే కూడా తలకు విశిష్టమైన స్థానం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. తలలో భద్రంగా ఉండే మెదడు అన్ని శరీర భాగాల చేత పని చేయిస్తుంది. శరీర సమతుల్యతను కాపాడుతుంది. ఏదేని ప్రమాదం జరిగినప్పుడు మెదడుకు దెబ్బ తగిలితే, తగిలిన చోట ఉన్న మెదడు కణాలు (న్యూరాన్లు) నశిస్తాయి.

శరీరంలో ఉన్న మిగతా కణాలకు, న్యూరాన్లకు స్వల్పమైన తేడా ఉంది. శరీరంలో నశించిన న్యూరాన్ల స్థానంలో కొత్తవి తయారు కావు, కానీ కణాలు మాత్రం కొత్తవి తయారవుతాయి. న్యూరాన్లు నశించటంతో అప్పటివరకూ ఆజమాయిషీ చేస్తోన్న అవయవాల పనితీరు దెబ్బతింటుంది.

దెబ్బ తీవ్రతను బట్టి కొన్ని అవయవాలు శాశ్వతంగా చచ్చుబడటం, జ్ఞాపకశక్తిని కోల్పోవటం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి... తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి టూవీలర్స్‌ను నడిపేవారు హెల్మెట్‌ను ధరిస్తారు. ఈ హెల్మెట్ వాడకం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గిస్తుంది.

ఈ మధ్యకాలంలో ఆయా ప్రభుత్వాలు హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ... వాహన ఛోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనలను కూడా కఠినతరం చేసిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి