ఉపవాసాల పేరిట కడుపు మాడ్చుకుంటున్నారా? ఇవి తప్పక తీసుకోవాల్సిందే

సోమవారం, 22 మే 2017 (11:01 IST)
ఉపవాసాలు తరచూ చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా ఉండకూడదని.. ఆ సమయంలో శరీరానికి తగిన పోషకాలు అవసరమని గుర్తించాలి. 
 
మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవడం మంచిది. అలాగే ఉపవాసం ముగించాక నూనె, వెయ్యి వేసి స్వీట్లు, కొవ్వు పదార్థాల వంటివి లాగించేయకూడదు. ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలం దక్కదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ, సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన కిచిడీ, పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం. 
 
అదేవిధంగా పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్థాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే.. ఉపవాస సమయంలో శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు అధికంగా తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా శక్తికి కొదవవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి