అబ్బబ్బా భార్యాభర్తలు, లవర్స్ పోట్లాడుకుంటున్నారా..? అయితే "కౌగిలింత మంత్రా" బాగా పనిచేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. పోట్లాటలు వచ్చినప్పుడు కౌగిలించుకోవడం ద్వారా అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. అంతేకాదండోయ్.. చిన్నపిల్లలు.. ముద్దొచ్చే వాళ్ల మాటలు, ఆనందాన్నిచ్చే అల్లరి చేష్టలు తల్లిదండ్రులకే కాదు, ఇతరులకూ నచ్చుతాయి. అందుకే అమాంతం హగ్ చేసేసుకుంటారు. అలా చేయడంలో కొన్ని లాభాలున్నాయట. ముఖ్యంగా ఆత్మీయంగా కౌగిలించుకుని సర్ది చెప్తే ఎంత పెద్ద కష్టాన్నైనా మరిచిపోతారు. ఈ విషయం "శంకర్‌దాదా ఎంబీబీఎస్" సినిమాలో చూశాం. అందుకే కౌగిలింత ఓ ఔషధంలా పని చేస్తుందని అంటున్నారు.
స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇలా ఒక్కొక్కరు ఇచ్చే కౌగిలి ఒక్కో రకమైన భావాన్ని తెలియజేస్తుంది. ఆప్యాయతతో కూడిన కౌగిలి ఒత్తిడిని దూరం చేసి మనసు ప్రశాంతంగా మారుస్తుంది. ఓటమితో కుంగిపోయే సమయంలో తండ్రి ఇచ్చే కౌగిలి కొండను ఢీకొట్టేంత బలాన్ని, ఓటమిని మరిచిపోయేంత శక్తినిస్తుంది. ఎన్నాళ్లో వేచి చూసిన ఆత్మీయులు కళ్లెదుట నిలబడితే ఆ ఆనందాన్ని పట్టలేక ఎదుటివారిని రెండు చేతులతో చుట్టేసే కౌగిలింత ఇన్ని రోజులు మిస్సయిన బాధను, ప్రేమను వ్యక్తపరుస్తుంది.
బాధలో అయినా, సంతోషంలో అయినా స్నేహితుల మధ్య ఉండే కౌగిలిలోని ఆత్మీయత మాటల్లో వర్ణించలేనిది. ప్రేమగా కౌగిలించుకునే భాగస్వామి కౌగిలి ప్రపంచాన్ని గెలిచేటంత బలం, భూమిని చాపలా చుట్టేసటంత ధైర్యాన్నిస్తుంది. బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా దాన్ని వ్యక్తపరచడానికి ఆశ్రయించే భాష కౌగిలి.