పాలు, పాల పదార్థాలు

మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:40 IST)
పాలు రుచిగావుండి ప్రాణపదమయిన ఆహారం, దేహపుష్టి, బలం, వీర్యవృద్ధి కలుగజేస్తుంది. మేధను పెంచుతుంది. జ టరాశయం లోని దుర్గుణాలను బయటకు నెడుతుంది. విరేచనకారి అతిగా తీసుకుంటే, పైత్యం, వేడి, శ్లేష్యం కలుగజేస్తుంది. ఇందుకు విరుగుళ్ళు పంచదార, తేనె, నిమ్మపండ్ల రసం..
 
పాలు: పచ్చిపాలు రుచి తక్కువగా, కడుపులో బరువుగా వున్నట్లు అనిపిస్తాయి. అజీర్ణం, వాతం కల్గిస్తాయి. అపద్యమయినవి. కాచిన పాలు తాపం, శ్లేష్మం హరిస్తాయి. ఆకలిని పెంచి వీర్యపుష్టి బలం కలుగజేసి శరీరానికి సుఖాన్ని కలుగజేస్తాయి.
 
మధ్యాహ్నానికి మందుగా పాలు సేవిస్తే వీర్యవృద్ధి, దేహపుష్టి, జఠరదీ కలుగుతుంది. మధ్యాహ్నం పుచ్చుకొంటే బలం, వీర్యపుష్టి నిచ్చి కఫం, మేహం, శ్లేష్మాలను హరిస్తుంది. శరీరానికి వేడినిస్తుంది. రాత్రిపూట తాగితే అనేక దోషాలను నివారిస్తుంది, బలాన్నిస్తుంది. వీర్యపుష్టి కలుగజేస్తుంది. అమృతం సమానంగా పనిచేస్తుంది. అయితే పాలు తాగిన వెంటనే నిద్రించకూడదు. కొంత సమయం అటూ, ఇటూ తిరిగిన తరువాతనే పక్కమిదకు చేరాలి.
 
కుష్టు, కఫం, ఆమజ్వరం, మేహం, అతిసారం, అజీర్ణం, రక్తవిరేచనాలు, నీళ్ళ విరేచనాలు, శ్లేష్మరోగం, పైత్యరోగం కలవారికి పాలు అపథ్యం. వీరు పాలను సేవించకూడదు. వ్యాధి నుండి తేరుకొని ఔషధసేవన చేయుచున్నవారు, గర్భిణులు, ప్రసవించిన స్త్రీలు, శరీర కష్టం చేసేవారు, బాలలకు, వృద్ధులకు, నీరసముగానున్న వారికి పాలు అమృతతుల్యంగా పనిచేస్తాయి.
 
పాలకంటే ఎక్కువ పోషకాన్నిచ్చే మరో ఆహారం ఈ సృష్టిలో లేనే లేదంటే, అతిశయోక్తి మాత్రం కాదు. రోగులకు బలం పుంజుకుని, తేరుకునేందు కుపకరిస్తే, ఏరోగం లేనివారికి, ఇవి తాగినందువలన రోగనిరోధక శక్తి పెరిగి బలంగా ఆరోగ్యంగా వుంటారు.
 
పాలు తేలికగా జీర్ణమయ్యే ద్రవఆహారమే అయినా, నీరు కలపని పాలు మందంచేసి అజీర్ణం చేస్తాయి. పాలలో సమపాళ్ళలో నీళ్ళుకలిపి మరిగించి చల్లార్చి సేవించడం ఉత్తమం. నల్లావుపాలు మిగతా వాటికంటే ఎక్కువ పోషకపదార్థాలు కలిగి ఆరోగ్యదాయకమైనవి. తగుమోతాదులో ప్రతిదినం తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయి.
నరాల బలహీనత, టి.బి., రికెట్స్, మలబద్దము, ఆస్తమా, ఫైల్స్ వంటి ఇబ్బందులతో బాధపడేవారు, ఒక కప్పు బాగా కాచిన మేకపాలు కొంచెం తేనె కలిపి ప్రతిరాత్రి సేవిస్తే మంచిది. 
 
కడుపు నిండుగా భోజనం చేసిన తరువాత, పాలు తాగడం ఎంత మాత్రం మంచిది కాదు. అజీర్ణం, మలబద్దం కలుగుతాయి. భోజనానంతరం రెండు గంటల విరామం తరువాత పాలు తీసుకోవాలి. పాలు తాగాక పుల్లని పండ్లుఎంత మాత్రం తినకూడదు. పాలు కొంచెం పంచదార కలిపి సేవిస్తే మంచిది.
 
 ఒక కప్పు మరిగించిన ఆవుపాలలో అర టీస్పూను పసుపుపొడి, రుచికి కొంచెం తేనె కలిపి తాగితే వ్యాధుల వలన ఏర్పడిన నీరసం తొలగి శరీరపుష్టి కలుగుతుంది.
 
కొంచెం పాలు కలిపిన నీళ్ళతో ముఖం కడుక్కుంటే చలికాలంలో చర్మం పగలడం వలన వచ్చే ఇబ్బంది తొలగిపోతుంది.
కప్పు వేడిపాలలో మిరియాలపొడి, పటిక బెల్లం కలిపి తాగినందు వలన సామాన్యంగా వచ్చే జలుబు తగ్గుతుంది.
నాలుగు టీ స్పూనుల పాలలో చిటికెడు ఉప్పు కలిపి పూస్తే ముఖంమీదిముడతలు పోతాయి.

తాజాగా తీసిన పాలపైని నురుగు నాలుగైదు రోజులు తింటే నోటిలోని అల్సర్లు పోతాయి. కొంచెం పాలలో రెండు ఏలకులను నూరి, ఆ పేస్టును, లేత కొబ్బరిబొండాల నీళ్ళలో కలిపి నాలుగైదు రోజులపాటు తాగుతుంటే, మూత్రబంధనం నివారణై, నీరుడు సాఫీగా జారీ అవుతుంది.

పాల మీగడతో ముఖం, అరచేతులు, మోచేతులు, పాదాలు రుద్దుకొని ఆరిన తరువాత స్నానం చేస్తే మచ్చలు, గాట్లు, మొటిమలు, ముడతలు పోయి, చర్మం నునుపుగా వుంటుంది. ఎండ తగిలి చర్మం రంగుమారినా ఇదే నివారణ. ఒక నెలరోజులపాటు ఈ విధానం కొనసాగించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు