ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ లక్షణాలు

గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:47 IST)
తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జర్వం కలిగియుండటం మత్తు నిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి. స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి. టీవి చూడండి, రేడియో వార్తలు వినండి, వార్తాపత్రికలు చదవండి.
 
నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రుమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగండి.
 
ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్‌యస్ కలిపిన నీటిని తాగవచ్చును. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని, నిమ్మరసము గాని, కొబ్బరినీరు గాని తాగాలి.
 
తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తల తిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి. ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీరుతో స్నానం చేయండి. తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్‌ను ఉపయోగించండి. మేడపైన మొక్కలు, ఇంట్లోని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్)  భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.
 
ఎండ తీవ్రతంగా ఉన్నప్పుడు చేయకూడనివి:
ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో  నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు. మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు. బాలింతలు,చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు.  వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంది.
 
శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే  పదార్దాలను తీసుకోవద్దు. ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకొనకూడదు. శీతల పానీయములు మరియు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యము ఏర్పడుతుంది.
 
ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు మరియు కిటికీలను తీసివుంచి తగినంత  గాలి వచ్చేవిదంగా చూసుకోండి. వడ దెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏమాత్రం ఆలస్యం చేయరాదు.
 
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కోవిడ్ -19 దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు:
బహిరంగ  ప్రదేశాల్లో ఉన్నప్పుడు కనీసం 1 మీటరు భౌతిక దూరం పాటించాలి. చేతులను నీరు, సబ్బుతో తరుచుగా శుభ్రపరుచుకోవాలి. నీరు, సబ్బు అందుబాటులో లేకపోతే శానిటైజర్లతో శుభ్రపరుచుకోవాలి. ఇంటిలోని ప్రతి సభ్యునికి  తువ్వాళ్లు ఉంచాలి. వాటిని తరుచుగా శుభ్రపరుచుకోవాలి. అనారోగ్యముతో ఉన్నట్లయితే ఎండలో తిరగరాదు, డాక్టర్ని సంప్రదించాలి. ఆనారోగ్యముతో ఉన్నవాళ్ళకు దూరంగా ఉండాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు