కామెర్ల వ్యాధి తగ్గాలా? అయితే రోజూ ఓ గ్లాసు బీరకాయ రసం తీసుకోండి..!

శుక్రవారం, 5 ఆగస్టు 2016 (13:05 IST)
ఆకుపచ్చని రంగులో పొడవుగా ఉండే బీరకాయలు ఈ సీజన్ లో చాలా విరివిగా దొరుకుతుంది. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో ఐరన్ రిబోఫ్లేవిన్, సి విటమిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆహారం. 
 
బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. విరేచన కారిగా పనిచేస్తుంది. అందువల్లనే పత్యంగా బీరకాయ చాలా మంచిదని పెద్దలు అంటుంటారు. లేత బీరపొట్టు వేపుడు జ్వరం పడి లేచిన వారికి హితవుగా వుంటుంది. బీరకాయలో నీటిశాతం అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడేవారికి చక్కని ఔషదంగా పనిచేస్తుంది. రక్తంలోనూ మూత్రంలోనూ చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ వారీ డైట్‌లో దీనిని చేర్చుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే బీటాకెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజూ ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి