సాధారణంగా రాత్రి వేళల్లో భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించడం మంచిది కాదని, అందువల్లే కొద్దిసేపు నడవాలని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే, డయాబెటిక్ రోగులు ఇలా వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయట.
ఇదే అంశంపై టైప్-2 డయాబెటిక్ పేషెంట్లపై వైద్య శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందుకోసం కొంతమంది చక్కెర వ్యాధిగ్రస్తులను రెండు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఓ గ్రూపు వారిని భోజనం తర్వాత కొంతసేపు నడవమన్నారు. మరొక గ్రూపు వారిని నడవద్దన్నారు. కొన్నిరోజుల అనంతరం వీరిని పరిశీలించగా, భోజనం చేసిన తర్వాత నడిచిన వారిలో 22 శాతం బ్లడ్ షుగర్ స్థాయి తగ్గినట్టు గుర్తించారు.
సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే అధికబరువు కూడా తగ్గిన విషయాన్ని గమనించారు. నడవనివారిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. షుగర్ వ్యాధిగ్రస్థులు భోజనం తర్వాత నడవడం అన్నది మంచిదేనని పరిశోధకులు అంటున్నారు. అయితే, ఈ తరహా రోగులు వైద్యుల సలహా తీసుకోవడం ఎందుకైనా మంచిదని సూచన చేస్తున్నారు.