చాలామంది స్త్రీలు ప్రసవం తర్వాత శృంగారంపై పెద్దగా ఆసక్తి చూపరు. దానికి కారణం తన బిడ్డ పెంపకం, పోషణపై అధిక శ్రద్ధ చూపడమే. అయితే, పాప పెరిగి పెద్దదవుతున్నప్పటికీ... శృంగారంలో పాల్గొనేందుకు అనాసక్తి చూపుతుంటారు. లైంగిక కోర్కెలు పూర్తిగా అడుగంటి పోయినట్టుగా వారు ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల భర్తలకు దగ్గర కాలేకపోతున్నామనే భావన వారిలో ఏర్పడుతుంది. ఫలితంగా భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ప్రసవం తర్వాత తిరిగి మునుపటిలా లైంగిక జీవితం సాగడానికి ఎంత సమయం పడుతుందో వైద్య నిపుణుల వద్ద ప్రస్తావిస్తే...
సాధారణంగా ప్రసవం తర్వాత శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. తిరిగి మునుపటిలా జీవక్రియలన్నీ సజావుగా సాగడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. లైంగిక కోరికలు కూడా వారి వారి శరీరం తీరు మీద ఆధారపడి ఉంటాయి. కొందరికి ప్రసవం అయిన కొద్ది రోజులకే పరిస్థితి మునుపటిలా మారిపోవచ్చు. మరికొందరికి నెలలు గడుస్తున్నా లైంగిక కోరికలనేవి కలగకపోవచ్చు.
అయినప్పటికీ ఈ విషయంలో స్త్రీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్తగా తల్లి అవడం, పిల్లాడి పనులు, నిద్ర లేకపోవడం, ఇంటి బాధ్యతలు.... ఇవన్నీ కొత్తగా తల్లయిన మహిళల్లో ఒత్తిడి కలిగిస్తాయి. దాని వల్ల కూడా సహజంగానే లైంగిక కోరికలు తగ్గుతాయి. అలాగే ప్రసవం తర్వాత ఒడలిన శరీరం వేగంగా పుంజుకోవడానికి, తగినంత ఫిట్‌నెస్ సమకూరడానికి, కటి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ తర్వాత యధావిధిగానే శృంగారంలో పాల్గొనవచ్చు.