పరగడుపునే ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే...

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (08:43 IST)
చాలామంది నిద్రలేవగానే ఓ చెంబుడు మంచినీరు తాగుతారు. ఇంకొందరు బెడ్ కాఫీ లేదా టీ తాగుతారు. ఇది చాలా మందికి ఉండే అలవాటు. కానీ, నిద్రలేవగానే పరగడుపున ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని సమాచారం. అందువల్ల ఓ గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగితే జీర్ణ సమస్యలు మాయమవుతాయి. ముఖ్యంగా కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఇలా తాగితే వీటి నుంచి బయటపడొచ్చట. 
 
అలాగే, ఉదయాన్నే పరగడుపున మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. వాటిల్లో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఇది అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది. 
 
మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు, అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి తాగితే ఇంకా ఎంతో లాభం ఉంటుంది. శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరంలో చక్కెర నిల్వల స్థాయి నియంత్రణలో ఉంటుందట. 
 
విరేచనాలతో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయట. హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుందని గృహ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు