మనం నిత్యం వండుకునే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. దీనిలో పలు విధములైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. దీనిలో కొద్ది మోతాదులో థయామిన్, రైబోప్లావిన్, ఫోలెట్, నియామిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటివి లభిస్తాయి. అంతేకాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్దం కూడా చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం.
బంగాళదుంపలో కార్టినాయిడ్స్ మరియు పాలీఫినాల్స్ వంటి రసాయనాలు ఉన్నాయి. ఇది శరీర పౌష్టికతను పెంచుతుంది. గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకునే శక్తిని ఇచ్చి కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అయితే ఈ బంగాళదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుండి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుంటుంది. అదెలాగో తెలుసుకుందాం.
1. ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్ళు. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్ళు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజు చేస్తే ఉంటే నల్లటి వలయాలు తగ్గుతాయి.
2. బంగాళదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేయండి. ఆ పేస్ట్‌ని ముఖానికి రాసుకుని అరగంట పాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవడంతో పాటు ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది.