నేరేడు ఆకుల కషాయం తాగితే...

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (15:19 IST)
ప్రకృతి సహజంగా లభించే పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో నేరేడు పండ్లు కూడా ఉన్నాయి. ఇవి ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. మంచి పోషకాలను అందిస్తాయి. కొన్ని రోగాలను నివారిస్తాయి. ఒక్క పండే కాకుండా దీని ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం వంటివి నేరేడులో పుష్కలంగా లభిస్తాయి. ఔషధాల తయారీలో కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు.
 
నేరేడులో ప్రోటీన్స్‌, ఖనిజాలు, పిండిపదార్ధాలు, ఫాస్ఫరస్‌, ఐరన్‌, విటమిన్‌ సి ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం, తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. 
 
గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురు రంగు ఆహారాలైన నేరేడు పండ్లు, టమోటా వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 
నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం, చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. వేసవిలో వేడి వాతవరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. అలాగే ఎముకలు బలంగా ఉండేదుకు కూడా సహాయపడుతుంది. నేరేడులో విటమిన్‌-ఎ, సి వంటి పోషకాలుంటాయి. ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు