బనానా కోఫ్తా కర్రీ ఎలా చేయాలి?

మంగళవారం, 7 జూన్ 2016 (16:39 IST)
అరటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కంటికి మేలు చేస్తుంది. అలాంటి అరటికాయలతో అరటి కోఫ్తా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
అరటికాయలు - 3
అల్లం పేస్ట్‌ -  తగినంత
పసుపు పొడి - చిటికెడు
కారం - సరిపడా,
వెల్లుల్లి పేస్ట్‌ - తగినంత
గరంమసాలా పౌడర్‌ - 1 స్పూన్‌,
కోడిగుడ్డు - 1
శనగపిండి - 2 స్పూన్‌‌లు,
పంచదార - 1 స్పూన్‌,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా. 
 
తయారీ విధానం : 
ముందుగా అరటికాయలను తొక్క తీయకుండా ఉడికించుకోవాలి. తరువాత తొక్క తీసి ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె మినహా పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి వేడి చేసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి ఫ్రై చేయాలి. బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తరువాత మిగిలిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కారం, పంచదార, గరం మసాలా వేసుకుని అందులో రెండు కప్పుల నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. చివరగా ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలను వేసుకుని రెండు, మూడు నిమిషాలు ఉంచాలి. అంతే నోరూరించే బనానా కోఫ్తా కర్రీ రెడీ.

వెబ్దునియా పై చదవండి