దుర్వాసన పట్టిన కబోర్డులు, చెమ్మగిల్లిన సోఫాలు, తుప్పుపట్టిన ఫర్నీచర్‌తో ఇబ్బందులు పడేవాళ్లు ఈ జాగ్రత్తలను పాటిస్తే మంచిది. సోఫాలను కవర్లతో సరిపెట్టకుండా వాటికింద ఓ ప్లాస్టిక్ షీట్‌ను వేసుకోవాలి. ఇలా చేయటంవలన కుషన్లు పాడవకుండా కాపాడుకోవచ్చు. అలాగే మంచంపై వాడే పరుపుపై ప్లాస్టిక్ కవర్ వేసుకుంటే మంచిది.
మంచి చెక్కతో తయారైన ఫర్నీచర్‌ను కిటికీల పక్కగా పెట్టకూడదు. ఒకవేళ అలా పెట్టినట్లయితే వర్షం పడే సమయాలలో చినుకులు పడడంవలన అవి తడిసి, పాడవటమేగాకుండా ఉబ్బుతాయి. తేమ ఎక్కువగా ఉన్న ఇళ్లలో సోఫాలు చెమ్మగిల్లే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు సోఫాలు, కుర్చీలను ఓ మెత్తని పొడిబట్టతో తుడవటం చాలా అవసరం.
సోఫాల వెనుకవైపున గాలి తగలని చోట ఫంగస్ పెరుగుతున్నట్లుగా అనిపిస్తే గోరువెచ్చని నీటిలో డెటాల్ కలిపి మెత్తని పొడిబట్టను అందులో ముంచి ఫంగస్ ఉన్నచోట రుద్దాలి. కబోర్డులు వంటి వాటిని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా అమర్చుకోవాలి. లేకపోతే గోడలు చెమ్మగిల్లే ఇళ్లలో ఫర్నీచర్ కూడా చెమ్మగిల్లి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.