ఆఫ్రికా ఖండ దేశం కాంగోలో నదిలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో వంద మందికి పైగా జలసమాధి అయ్యారు. సుమారు 220 మందితో షువాపా నదిలో ప్రయాణిస్తున్న పడవ మరో పడవను ఢీకొట్టినట్లు ఈక్వెటియర్ ప్రావిన్స్ ప్రతినిధి రెబెకా ఎబలే న్గుమా తెలిపారు. కనీసం 105 మంది చనిపోగా మిగతా వారు గల్లంతయినట్లు రెబెకా చెప్పారు.
విస్తారమైన అడవులు, పెద్ద పెద్ద నదులతో కూడిన మధ్య ఆఫ్రికాలోని కాంగోలో చాలా కొద్ది మొత్తంలోనే రోడ్డు సౌకర్యాలు వున్నాయి. ఈ దేశంలో చాలా వరకూ ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరడానికి పడవలను ఉపయోగిస్తారు. నదుల్లో తరచూ జరిగే పడవ ప్రమాదాల్లో ఈత రాని అనేక మంది మృత్యువాత పడుతున్నారు.