నేపాల్ ప్రభుత్వానికి మావోయిస్టులు తాజాగా మరో హెచ్చరిక చేశారు. నిర్ణీత సమయంలోగా మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించకుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బెదిరించారు. మరోవైపు ప్రభుత్వం గద్దెదిగి ఏకాభిప్రాయ సాధన ద్వారా జాతీయ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని ప్రధాన విపక్షం నేపాలీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీంతో నేపాల్ ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.
మంత్రివర్గాన్ని సోమవారం సాయంత్రం లోగా పునర్‌వ్యవస్థీకరించాలన్నారు. తమ పార్టీకి చెందిన పలువురికి మంత్రివర్గంలో చోటుకల్పించాలని మావోయిస్టులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రధాని తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి దీనానాథ్ శర్మ ప్రకటించారు.