తాలిబాన్ తీవ్రవాదులతో సమర్థవంతంగా పోరాడేందుకు తమకు డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానాలు) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయాలని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ గురువారం అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా దళాలు తమ దేశ భూభాగంలో డ్రోన్‌ల ద్వారా క్షిపణి దాడులు జరుపుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో రెండు రోజుల క్రితం అమెరికా డ్రోన్ జరిపిన క్షిపణి దాడిలో 80 మంది పౌరులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పాక్ అధ్యక్షుడు జర్దారీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ పర్యటనలో ఉన్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేమ్స్ జోన్స్‌తో జర్దారీ ఇస్లామాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమకు డ్రోన్ పరిజ్ఞానాన్ని అందజేయాలని అమెరికాకు జర్దారీ విజ్ఞప్తి చేశారు.
తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్‌కు గట్టిపట్టు ఉన్న దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో మంగళవారం అమెరికా డ్రోన్‌లు రెండుసార్లు దాడి చేశాయి. ఈ దాడుల్లో అనేక మంది అమాయక పౌరులతోపాటు, 80 మంది మృతి చెందారు. తమ భూభాగంలో ఇటువంటి దాడులను సహించబోమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ బాసిత్ తెలిపారు. తీవ్రవాదంపై పోరుకు ఇటువంటి దాడులు ఆటంకం కలిగిస్తాయని హెచ్చరించారు.