పాకిస్థాన్‌కు సహాయం చేస్తాం: బ్రిటన్

పాకిస్థాన్‌లో సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

పాకిస్థాన్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితులను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అక్కడున్న ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు తమవంతు సహకారం అందిస్తామని, దీనికిగాను ఆర్థిక సహాయం అందజేస్తామని ఆ ప్రభుత్వం తెలిపింది.

బ్రిటన్‌పై దాడులకు పాల్పడే ఉగ్రవాదులు పాకిస్థాన్‌ దేశంలోనే దాగివున్నారని, వీరిని మట్టుబెట్టేందుకు తమ ప్రభుత్వానికి చెందిన దాదాపు రెండు వందల మంది అధికారులతోకూడిన ఓ బృందాన్ని పాకిస్థాన్ దేశానికి పంపిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

తాము రూపొందించుకున్న ప్రణాళికలననుసరించి రాబోయే ఆరు నెలల్లో అక్కడున్న ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు తాము నిశ్చయించుకున్నామని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తాము పంపించే బృందం అక్కడ వేళ్ళూనుకునివున్న ధార్మిక సంస్థలు, వారి మతఛాందసవాదాన్ని అధ్యయనం చేస్తుందని, దీంతోపాటు పాకిస్థాన్ దేశంలో ప్రజల ప్రభుత్వం ఏర్పడేందుకు వీరు కృషి చేస్తారని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి