ప్యారిస్‌లో దూతను నియమించిన లిబియా రెబెల్స్

లిబియా నియంత గడాఫీని అధికారం నుంచి తప్పించాలని తీవ్ర పోరాటం చేస్తున్న లిబియా తిరుగుబాటుదారులు తాజాగా అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టే భాగంగా ప్యారిస్, లండన్‌లో తమ రాయబారులను నియమించారు.

రెబెల్స్ నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌(ఎన్‌టీసీ) ప్యారిస్‌ ప్రతినిధి 63 ఏళ్ల మన్సూర్ సైఫ్ అల్ నస్ర్ ఫ్రెంచ్ విదేశాంగ శాఖకు తన అధికార పత్రాలను అందించినట్లు తెలిపారు. మేలో గడాఫీ ప్రతినిధులు ఖాళీ చేసిన రాయబార కార్యాలయ తాళాల కోసం నస్ర్ వేచిచూస్తున్నారు.

లిబియా మానవ హక్కుల లీగ్ మాజీ సభ్యుడైన నస్ర్ ప్రవాసంలో గడాఫీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1969లో లిబియాను వీడీన ఆయన 20 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్నారు. కాగా 74 ఏళ్ల రచయిత మహమ్మద్ నక్య లండన్‌లో ఎన్‌టీసీ ప్రతినిధిగా నియమించబడ్డారు. ఎన్‌టీసీని గుర్తించడంలో ఫ్రాన్స్‌ను అనుసరించిన బ్రిటన్ లండన్‌లో రాయబార కార్యాలయంలో మిగిలివున్న గడాఫీకి అనుకూలమైన అందరిని బహిష్కరించింది.

వెబ్దునియా పై చదవండి