మన్మోహన్‌తో మనస్ఫూర్తిగా కలుస్తాం: గిలానీ

తమ పొరుగుదేశమైన భారత ప్రధానిని కలవడం ఓ సువర్ణావకాశంగా భావిస్తున్నానని, ఆయనను మనస్ఫూర్తిగా కలుసుకుంటానని పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలాని అన్నారు.

భారతప్రధాని మన్మోహన్ సింగ్‌తో తాను మనస్ఫూర్తిగా కలుసుకుని మాట్లాడుతానని, తమ కలయిక ఇరుదేశాల మధ్యనున్న అడ్డుగోడను తొలగించేందుకు తాను ప్రయత్నిస్తానని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ తెలిపారు.

బుధవారంనాడు ఈజిప్టులో జరిగే 15వ నామ్(అలీనోద్యమ)శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల ప్రధానులు కలవనున్నారు. ఈ సందర్భంగా గిలానీ విలేకరులతో మాట్లాడుతూ...తాము భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నామని, సుహృద్భావ వాతావరణంలో తమ సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటామని, ఇరు దేశాలమధ్యనున్న అడ్డుగోడను తొలగించుకునేందుకు తాను ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.

ఇదిలావుండగా ఇరుదేశాల ప్రధానులు నామ్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈజిప్టులోని "హోటల్ మేరీటైమ్ జోలీ విలే గోల్ఫ్ రిసార్ట్ "లో సమావేశమవనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నిరుడు జరిగిన ముంబైలో జరిగిన మారణకాండపై చర్చించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి