హ్యాకర్ల ఆటకట్టించేందుకు ద కొరియా చర్యలు

ఉత్తర కొరియా, ఇతర దేశాల నుంచి తమ దేశ కంప్యూటర్లపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్టవేసేందుకు దక్షిణ కొరియా మిలిటరీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సైబర్ వార్‌ఫేర్ కమాండ్‌ను ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియా మిలిటరీ సన్నాహాలు చేస్తోందని అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించారు.

ప్రతిపాదిత సైబర్ వార్‌ఫేర్ కమాండ్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. సైబర్ కమాండ్ ఏర్పాటయితే విదేశీ హ్యాకర్ల ఆటకట్టించేందుకు ప్రత్యేక విభాగం పనిచేస్తుంటుంది. మిలిటరీ సంస్కరణల ప్యాకేజీలో సైబర్ వార్‌ఫేర్ కమాండ్ ప్రతిపాదనను కూడా చేర్చామని, దీనిని దేశ అధ్యక్షుడు లీ మైయుంగ్- బాక్‌కు పంపనున్నట్లు దక్షిణ కొరియా రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

దక్షిణ కొరియా మిలిటరీకి చెందిన కంప్యూటర్ నెట్‌వర్క్‌పై సైబర్ దాడులు బాగా పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో దక్షిణ కొరియా మిలిటరీ భద్రతా విభాగంలోని కంప్యూటర్‌లపై 10,450 హ్యాకింగ్ యత్నాలు జరిగాయి. 81,700 కంప్యూటర్లలోకి వైరస్ చేరింది. పొరుగునున్న చైనా, ఉత్తర కొరియా దేశాల్లోని హ్యాకర్లు తమ దేశంలో సైబర్ దాడులు చేస్తున్నారని దక్షిణ కొరియా మిలిటరీ అనుమానిస్తోంది.

వెబ్దునియా పై చదవండి