ఉక్రెయిన్‍‌లో రష్యా మరణమృదంగం : ఒక్క నగరంలోనే 2500 మంది హతం

మంగళవారం, 15 మార్చి 2022 (10:29 IST)
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర కారణంగా మారణహోమం జరుగుతుంది. ఉక్రెయిన్ పౌరులపై రష్యా సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అనేక మంది అమాయక ప్రజలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా రష్యా ఇప్పటివరకు జరిపిన క్షిపణిదాడుల్లో ఏకంగా 2500 మందికిపై అమాయర పౌరులు ప్రాణాలు కోల్పోయారు. చివరకు వీరి అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. 
 
మేరియుపోల్ నగరంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఈ నగరంలో శవాల గుట్టలు కుప్పలుతెప్పలుగా పేరుకునిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 2500 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు సలహాదారు ఒలెక్సీ అరిస్టోవిచ్ వెల్లడించారు. మేరియుపోల్‌కు చేరుకునే మానవతాసాయాన్ని కూడా రష్యా సైనికులు అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గత రెండు రోజుల్లోనే ఈ నగరంలో మరణాల సంఖ్య మరింతగా పెరిగిపోయిందని ఆయన చెప్పారు. రష్యా దాడులు ప్రారంభించిన తొలి 12 రోజుల్లో 1500 మంది ప్రాణాలు కోల్పోతే ఇపుడు ఈ సంఖ్య 2500కు చేరిందని ఆయన వివరించారు. మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని సైతం చేరుకునేందుకు రష్యా బలగాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం స్థానికంగా ఓ నివాస భవనంపై జరిపిన వైమానిక దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు