అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో నరమేథానికి పాల్పడింది. ఇరాక్ రెస్టారెంట్‌పై విరుచుకుపడింది. ఫలితంగా 74 మంది మృత్యువాతపడ్డారు. దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంటుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఆపై అక్కడికి దగ్గరలోనే ఉన్న చెక్ పోస్టుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో 74 మంది మృతిచెందగా, మరో 91 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలో పరిస్థితి భీతావహంగా ఉందని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
కాగా, భద్రతా బలగాలతో కలసి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షియా సంస్థ 'హషీద్ అల్ షాబి' సభ్యుల రూపంలో వచ్చిన ముష్కరులు ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ సంస్థ అధికారికంగా వెల్లడించింది.